పోస్టల్ సేవల కోసం మనం ఇక పోస్టాఫీసుకు వెళ్ళనవసరం లేదు. ఇక ఆన్ లైన్లో సేవలందించేందుకు డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను పోస్టాఫీసులు సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ సేవలను భారతీయులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టల్ శాఖ డిజిటల్ బ్యాంకింగ్ మేళాలు నిర్వహిస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ ఆన్ లైన్ సేవలు అందించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా, కృష్ణాజిల్లా కొండపల్లిలో వి.టి.పి.ఎస్. బ్రాంచిలో డిజిటల్ బ్యాంకింగ్ మేళా ఘనంగా ప్రారంభం అయింది. ఈ నెల 22 వరకు ఈ మేళా ద్వారా ప్రభుత్వోద్యోగులందరికీ పోస్టల్ ఖాతాలు తెరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా అతి తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ వచ్చేలా అందించే పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా డిజిటల్ గా అందించే ప్రక్రియను రూపొందించారు. దీనితోపాటు సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్ ఎకౌంట్, సుకన్య సమృద్ది యోజన, కిసాన్ వికాస్, ఎన్.ఎస్.ఎస్., అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలన్నింటిలో ఉద్యోగుల భాగస్వామ్యం కల్పిస్తున్నామని పోస్టల్ అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ బ్యాంకింగ్ కోసం అన్ని అకౌంట్లు డిజిటలైజ్ చేస్తున్నామని విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోస్టాఫిసెస్ కె.ఎల్.ఎన్.మూర్తి చెప్పారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన సచివాలయం వ్యవస్థను కూడా తాము స్పెషల్ డ్రైవ్ గా తీసుకుంటున్నామని కొండపల్లి పోస్టాఫీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ కె.ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. సచివాలయం వాలంటీర్లకు, ఇతర సిబ్బందికి కూడా డిజిటల్ ఎకౌంట్లను పోస్టాఫీసు ద్వారా తెరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.