ఎపిలో పసుపు కాంగ్రెస్... బాబుకు బలం వస్తుందా? మొదటికే మోసం వస్తుందా?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు తెలుగుదేశంలో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు అధినేత చంద్రబాబు ఈ విషయమై తర్జన భర్జన పడుతుండగా, మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే కాంగ్రెస్‌తో పొ

శనివారం, 25 ఆగస్టు 2018 (18:31 IST)
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు తెలుగుదేశంలో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు అధినేత చంద్రబాబు ఈ విషయమై తర్జనభర్జన పడుతుండగా, మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాము రాజీనామాలు సిద్ధమని బహిరంగ ప్రకటన చేస్తున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టిడిపిలో కాంగ్రెస్ పొత్తు అంశం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది.
 
దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మాభిమానం పేరుతో ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి అప్పట్లో అధికారపీఠం కైవసం చేసుకున్నారు నందమూరి తారకరామారావు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీ నాయకత్వంలో మార్పు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో వైరం మాత్రం టిడిపికి అలాగే కొనసాగుతోంది. అయితే మారిన రాజకీయాల నేపథ్యంలో శత్రుత్వం మిత్రత్వంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపికి ప్రధాన శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు. పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ చెయ్యివ్వడంతో పాటు వామపక్షాలు కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన ముందున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. విభజన నేపథ్యంలో ప్రధాన నాయకులు వెళ్ళిపోవడంతో రెక్కలూడిపోయి చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఇప్పుడు టిడిపి అధినేతకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. నాయకులు వెళ్ళిపోయినా ఆ పార్టీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉందన్న ఆలోచనతో ఆ పార్టీతో జత కడితే ఎలా వుంటుందన్న చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
 
గత ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోకపోయినా 8 లక్షల ఓట్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈసారి ఆ సంఖ్య 20 లక్షల దాకా చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు నాలుగేళ్ళుగా బిజెపితో ఉన్న మిత్ర బంధాన్ని ఎన్నికల ముందు తెంచుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కాంగ్రెసే దిక్కుగా కనిపిస్తోంది. అలాగే తెలంగాణాలో టిడిపి దాదాపు ఖాళీ అయిపోవడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడా ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బాబు. ఈ నేపథ్యంలో ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్న చందంగాను కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల అటు తెలంగాణాలో ఐదారు స్థానాలు గెలిచి అసెంబ్లీలో తామున్నామని నిరూపించుకోవాల్సిన స్థితిలో ప్రస్తుతం తెలంగాణా టిడిపి ఉంది. 
 
అలాగే ఎపిలోను కాంగ్రెస్ ఓట్లు టిడిపికి జమ అయితే మరో పది స్థానాలు గెలవచ్చన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా బిజెపితో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి తన వ్యూహాన్ని మొదలెట్టేశారు చంద్రబాబు. ఇందుకోసం కర్ణాటక ఎన్నికలను వేదికగా ఎంచుకున్నారు. బిజెపితో వైరం నెపంతో కాంగ్రెస్ - జెడిఎస్‌లకు స్నేహహస్తం చాటారు. ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఒకే వేదిక పంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. 
 
ఇందులో భాగంగానే రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగానే టిడిపి మద్ధతు తెలిపింది. అలాగే సిఎం రమేష్‌కు కాంగ్రెస్ మద్ధతుతో రాజ్యసభలో కీలక పదవి దక్కింది. ఇదే స్నేహం వచ్చే ఎన్నికల వరకు కొనసాగించేందుకు సిద్థమవుతోంది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త పడుతోంది. ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నామన్న సంకేతాలు ఇప్పటినుంచే మొదలుపెట్టేసింది.
 
అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు చంద్రబాబు సిద్థమైనందు వల్లే కిరణ్ తమ్ముడు కిషోర్‌ను టిడిపిలోకి తీసుకుని అన్నను మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్ళమన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వ అవిశ్వాసం సమయంలో పడిపోకుండా కాపాడిన చంద్రబాబు ఇప్పుడు అదే తరహా ఆలోచనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఏది ఏమైనా చంద్రబాబు కాంగ్రెస్‌కు ఇస్తున్న స్నేహ హస్తం తెలంగాణాలో వర్కవుటై ఆ పార్టీకి నాలుగో, ఐదో స్థానాలు వచ్చినా ఎపిలో మాత్రం ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి ప్రారంభం నుంచే కొంతమంది సీనియర్ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కె.ఈ.క్రిష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడుతో పాటు నారాయణ లాంటి నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరగడం అలా ఉంచితే ఈ నిర్ణయం బెడిసికొడుతుందన్న భయాన్ని అంతర్గతంగా వ్యక్తమవుతోంది. అలాగే దశాబ్ధాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ - టిడిపిలో పైస్థాయిలో ఉన్న నేతలు కలిసినా దిగువస్థాయి కార్యకర్తలు కలిసి పనిచేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయం టిడిపికి బలాన్ని చేకూరుస్తుందో లేక మొదటికే మోసం చేస్తుందో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న మంత్రి అమరనాథ్ రెడ్డి...