ఇంతకీ... తలైవర్ వస్తారా? రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ చర్చ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. దీనికితోడు... రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటా తను అడ్డుకుని తీరుతానంటూ మరో తమిళ హీరో శరత్ కుమార్ చేసిన ప్రకటన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఫలితంగా ఆగ్రహానికి గురైన రజినీకాంత్ అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.
నిజానికి తమిళ సూపర్‌స్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలంటూ కొన్నేళ్లుగా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు మొదలు జాతీయ పార్టీల వరకు ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి గతంలో పలు ప్రయత్నాలూ చేశాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ సైతం రజినీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు.
రాజకీయప్రవేశం విషయంలో రజినీకాంత్ ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్నారు. తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జయలలిత మృతితో రాష్ట్ర రాజకీయాల్లో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మరోమారు రజినీకాంత్ అంశం రాజకీయ తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ఆయన అవసరముందని, ఇదే విషయాన్ని చో రామస్వామి పలుమార్లు పేర్కొన్నట్లు తుగ్లక్ పత్రిక సంపాదకుడు ఎస్.గురుమూర్తి ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించడమే దీనికి కారణం. ఈ వ్యాఖ్యలపై సినీనటుడు, అఖిల భారత సమత్తువ మక్కళ్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
అదేసమయంలో తమిళనాడులో తిరుగులేని రాజకీయనేతగా విమర్శకుల మన్ననలు అందుకున్న జయలలిత మృతితో ప్రస్తుతం రాజకీయ శూన్యం ఏర్పడినట్టు పలువురు భావిస్తున్నారు. ఇదే అదనుగా ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి పలు రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అందులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ముందున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన శాసనసభ, ఉప ఎన్నికల్లో భాజపా మూడో స్థానంలో నిలవడంతో మరికొంత ప్రయత్నిస్తే తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అవకాశముందని ఆ పార్టీ జాతీయ నేతలు సైతం గట్టిగా నమ్ముతున్నారు.
ఇందుకు ప్రజాకర్షణ కలిగిన కొందర్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రజినీకాంత్ మద్దతు కోసం భాజపా జాతీయ నేతలు పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది. అలాగే రజినీకాంత్ ద్వారా మరింత లబ్ధి పొందడానికి ప్రాంతీయ పార్టీలు సైతం ప్రయత్నిస్తున్నాయి. ఒకవిధంగా రజినీపై రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అభిమానులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా స్పందిస్తారనే అంశం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.