Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ప్రైవేటు హోటళ్లు అవసరం లేదా? టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

తిరుమలలో ప్రైవేటు హోటళ్లు అవసరం లేదా? టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయం సరైనదేనా?
, శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:10 IST)
అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. ఆకలితో అలమటించే ప్రాణికి పిడికెడు అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదని పెద్దలు చెబుతుంటారు. దీన్నే తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వసిస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ, అన్నప్రసాద వితరణ భక్తుల సంక్షేమ కార్యక్రమాలను టిటిడి చాలా వరకు అమలు చేస్తోంది. ఆకలితో ఉన్న ప్రతి భక్తుడికి కడుపునిండా కావాల్సినంత భోజనాన్ని టిటిడి వడ్డిస్తోంది. 

 
టిటిడి చేస్తున్న అన్నప్రసాద వితరణ గురించి చాలామందికే తెలిసే ఉంటుంది. అయితే తిరుమల లాంటి ప్రాంతంలో ప్రైవేటు హోటళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే భక్తులను నిలువు దోపిడీ చేసేది వీరే. తినే తిండికి అధికరేట్లను వసూలు చేసి భక్తుల జేబులకు చిల్లులు పెడుతుంటారు. ప్రతిరోజు వందలాదిమంది భక్తులు ప్రైవేటు హోటళ్ళనే ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రైవేటు హోటల్స్ 35, ఫాస్ట్ ఫుడ్స్ 140 దాకా ఉన్నాయి. ఇక ప్రైవేటు హోటళ్ళలో 25 నుంచి 30 దాకా సిబ్బంది పనిచేస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో ఒక్కో దాంట్లో అయితే 10 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. 

 
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొత్తం ప్రైవేటు వ్యక్తులు నడుపుతుంటే, హోటల్స్‌లో సగందాకా టిటిడి లీజ్ కింద నడుపుతోంది. మిగిలినవి ప్రైవేటు వ్యక్తులే నడుపుకుంటున్నారు. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధిక రేట్లు ఎప్పుడూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. ఇన్ని రోజుల పాటు ప్రైవేటు హోటల్స్ గురించి పట్టించుకోని టిటిడి ఇప్పటికిప్పుడు ఆ హోటల్స్ లేకుండా చేద్దామని ఎందుకు నిర్ణయం తీసుకుందోనన్న అనుమానం చాలామందిలో ఖచ్చితంగా ఉంటుంది. 

 
తిరుమలలోనే కాకుండా వేంకటేశ్వరస్వామి కీర్తిని నలువైపులా వ్యాపింపజేయడంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెళుతుంటారు. ఆయన దృష్టికి సామాన్య భక్తులు ప్రైవేటు హోటల్స్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్ వ్యవహారాన్ని తీసుకెళ్ళారు. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులపై దృష్టి పెట్టాలని ఎప్పటి నుంచో టిటిడి ఛైర్మన్ భావించారు.

 
ఇదే విషయాన్ని పాలకమండలి సభ్యులు, టిటిడి ఈఓతో పాటు అదనపు ఈఓ దృష్టికి కూడా తీసుకెళ్ళారు. కానీ చాలామంది పాలకమండలి సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకుంటే పాలకమండలి సభ్యులకు చాలామంది పరిచయమున్న వ్యక్తులే ఈ ప్రైవేటు హోటళ్ళను నడుపుతున్నారు కాబట్టి. 

 
ప్రైవేటు హోటళ్ళలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సారంగి, అన్నమయ్య భవన్. ఫైవ్ స్టార్ హోటల్స్‌ను తలపించేలా ఈ హోటల్స్ ఉంటాయి. విఐపిలు ఈ హోటల్స్ లోనే భోజనం చేస్తుంటారు. విఐపిలంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది. అక్కడ ఏ స్థాయిలో రేట్లు ఉంటుందన్నది. 

 
ఇక సామాన్య, మధ్య తరగతి భక్తులైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లనే నమ్ముకుంటూ ఉంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్ళీ అల్పాహారం ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో దొరుకుతూ ఉంటుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రోటీ, పుల్కా లాంటివి అందుబాటులో ఉంటుంది. ఇక ప్రైవేటు హోటల్స్ విషయాన్ని పక్కనబెడితే టిటిడి నడుపుతున్న అన్నదానం గురించి తెలుసుకుందాం..18వ శతాబ్ధంలో అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. అప్పట్లో అన్నదానం ప్రారంభినట్లు పత్రాలు కూడా ఉన్నాయి.

 
ప్రస్తుతం తిరుమలలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు.  అసలు తరిగొండ వెంగమాంబ పేరుతోనే ఎందుకు అన్నదానం చేస్తున్నారో తెలుసుకుందాం.. ఉత్తరాన గోల్కొండ నుంచి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్సనకు వచ్చినప్పుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారట. 

webdunia
అప్పటికి 30 నుంచి 40 వరకు దానపత్రాలున్నాయి. క్రీశ.1785 నుంచి క్రీశ.1812 వరకు దాదాపు 30 సంవత్సరాల కాలపరిధిలో వెలువడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. దానపత్రాల ఆధారంతో తరిగొండ వెంగమాంబ వారసత్వాన్ని టిటిడి నేటికి కొనసాగిస్తూ వస్తోంది. 1985 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేతుల మీదుగా శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు.

 
మొదట్లో రోజుకు 2 వేల మంది తిరుమలలో అన్నప్రసాదాలు స్వీకరించేవారు. ఆ తరువాత 1994 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. దీనికి శ్రీ వేంకటేశ్వరర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. ప్రస్తుతం రోజుకు 60 వేల మందికి తగ్గకుండా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. గడచిన 35 సంవత్సరాల వ్యవధిలో అన్నప్రసాదంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శ్రీవారి దర్సనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుతుండడంతో అందుకు తగ్గట్టు మరింత రుచికరంగా, శుచిగా అన్నప్రసాదాలను తయారుచేస్తోంది టిటిడి. 

 
2011 సంవత్సరంలో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో ఓ దాత సాయంతో 33 కోట్ల రూపాయలతో అధునాతన అన్నప్రసాదం కాంప్లెక్స్ భవనాన్ని టిటిడి నిర్మించింది. అన్నప్రసాద భవనంలో రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు ఉన్నాయి. ఒక్కో భోజనశాలలో వెయ్యిమంది చొప్పున నాలుగు వేలమంది భక్తులకు ఎక్కడా వేచి ఉండే అవసరం లేకుండా భోజనం పెడుతున్నారు.

 
అంతేకాదు ఈ భవనంలో కూరగాయలు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ గదులు, వంట సరుకుల నిల్వ కోసం ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరర అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టుకు వివిధ జాతీయ బ్యాంకుల్లో 1300 కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు వినియోగిస్తున్నారు. ఒక సంవత్సరానికి 2 కోట్ల మందికిపైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఇందుకు గాను ఒక సంవత్సరానికి టిటిడికి 80 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతోంది. 

webdunia
తరిగొండ వెంగమాంబలో ప్రతిరోజు 40 వేల నుంచి 60 వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. 4 వేల మంది ఒక్కసారిగా కూర్చొని భోజనం చేసే అవకాశం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉంది. అలాగే మాధవం వసతి గృహంలో, కొన్ని మినీ అన్నప్రసాద కేంద్రాలు కూడా ఉన్నాయి. మినీ ప్రసాదాల కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు, బయటి క్యూలైన్లు, పిఎసి-2, కాలినడక మార్గంలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. 

 
తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 15 టన్నుల బియ్యం, 8టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ద్వారా టిటిడి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఎక్కువశాతం కూరగాయలు దాతల నుంచి విరాళంగా అందుతున్నాయి. వంకాయలు, గుమ్మడి, టమోటా, క్యాబేజీ, ముల్లంగి తదితర కూరగాయలు విరాళాలుగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల నుంచి అన్నప్రసాదాలను అందించేంఉకు శ్రీవారి సేవకులు స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారు కూడా. 

 
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 9.30 నిమిషాలకు అల్పాహారాన్ని ప్రారంభించి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని భక్తులకు పెడుతుంటారు. రాత్రి 11 గంటలకు అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని మూసివేస్తారు. ఆ తరువాత తిరిగి ఉదయం 9.30 నిమిషాలకే ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టిఫిన్ పెడుతున్నారన్న విషయం చాలామంది భక్తులకు తెలియదు. కేవలం భోజనం మాత్రమే పెడుతుంటారని... చాలామంది ప్రైవేటు హోటల్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. 

webdunia
ప్రైవేటు హోటల్స్, పాస్ట్ ఫుడ్స్, టిటిడి విషయాన్ని పక్కనబెడితే మఠాల్లో కూడా ఉచితంగా భోజనాలను అందిస్తున్నారు. పదికిపైగా మఠాలు తిరుమలలో ఉండగా అందులో ఐదుకుపైగా మఠాల్లో మధ్యాహ్నం పూట మాత్రమే భోజనాలను పెడుతున్నారు. అందులో ప్రధానంగా పుష్పగిరిమఠం వాసవి భవన్, గుబ్బ చౌల్ట్రీ లో భోజనం పెడుతుంటారు. ప్రతిరోజు 2వేల నుంచి 3వేలమందికి భోజనం పెడుతున్నారు. 

 
ఈ మొత్తం లెక్క ఒకసారి చూద్దాం.. టిటిడి ఉచితంగా అందించే భోజనాన్ని 40 నుంచి 60 వేల మంది, ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 4 వేల నుంచి 5 వేలమంది దాకా, ఇక  మఠాల్లో 3 వేల మంది దాకా ఇలా భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు టిటిడి తీసుకుంటున్న నిర్ణయంలో ప్రధానంగా ఉదయం అల్పాహారాన్ని తరిగొండ వెంగమాంబలో కాకుండా పాత అన్నదాన సత్రంలో పెట్టాలన్న ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే టిటిడి ఛైర్మన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు కూడా. అయితే పాత అన్నదాన సత్రం చిన్నదిగా ఉండడంతో మరమ్మత్తులకు శ్రీకారం చుట్టింది టిటిడి. 

 
ఒక నెలరోజుల్లో పాత అన్నదాన సత్రాన్ని పెద్దదిగా చేసి శ్రీవారి భక్తులకు టిఫిన్ సెక్షన్‌ను ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మాత్రం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే భోజనం పెట్టనున్నారు. 

webdunia
టిటిడి ఛైర్మన్ ఉన్నట్లుండి ప్రైవేటు హోటల్స్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్స్‌ను మూసేస్తామని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ప్రైవేటు వ్యక్తులు. ఎన్నో యేళ్లుగా తిరుమలలోనే ప్రైవేటు హోటల్స్‌ను నడుపుతుంటే టిటిడి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. అయితే టిటిడి ఛైర్మన్ నిర్ణయం కాబట్టి మిగిలినవారు ఎవరూ కూడా దీనిపై మాట్లాడటానికి సుముఖంగా లేరు. టిటిడి పాలమండలి సభ్యులే కాదు టిటిడి ఈఓ, టిటిడి అదనపు ఈఓలు ఇద్దరూ ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు టిటిడి ఛైర్మన్. 

 
మరో మూడు నెలల్లోగానే ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తిరుమలలో పూర్తిగా మూసి వేయనున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా తిరుపతిలోని టిటిడికి సంబంధించిన భవనాల్లోనే షాపులను కూడా కేటాయించనున్నారు. తిరుపతిలో టిటిడి కేటాయించే షాపులలో హోటల్స్ ఒక్కటే కాదు వారు ఏ వ్యాపారమైనా చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించబోతోంది. అయితే ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ నిర్వాహకులు టిటిడి ఛైర్మన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రుచికరమైన భోజనం తమ వద్దే లభిస్తుందంటున్నారు. టిటిడి అన్నదాన సత్రంలో ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభించి రాత్రి 11 గంటలకు మూసివేస్తే భక్తులకు భోజనం ఎలా దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు. 

 
ఉదయం 4 గంటలకు దర్సనానికి వెళ్ళే భక్తులు, రాత్రి 11 గంటల తరువాత దర్సనం ముగించుకుని వచ్చే భక్తులకు భోజనం ఎలా లభిస్తుందంటున్నారు. టిటిడి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు కోరుతున్నారు. ఏది ఏమైనా టిటిడి తీసుకున్న నిర్ణయంపై సామాన్య భక్తుల్లో మాత్రం సంతోషం వ్యక్తమవుతోది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో వైజాగ్ రైల్వే జోన్- జీవీఎల్ నరసింహారావు