Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంజనాద్రిపై హనుమాన్ గుడి కట్టొద్దన్న ఏపీ హైకోర్ట్

అంజనాద్రిపై హనుమాన్ గుడి కట్టొద్దన్న ఏపీ హైకోర్ట్
, బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (12:55 IST)
తిరుమల ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిపై ఆలయం లేదా మరే ఇతర కట్టడాలు నిర్మించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానంని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అయితే సుందరీకరణ పనుల్లో టీటీడీ ముందుకు వెళ్లవచ్చని, అందుకు భూమిపూజ నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది.

 
మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఆంజనేయ స్వామివారి జన్మస్థలంగా అంజనాద్రి అభివృద్ధికి టీటీడీ భూమిపూజ నిర్వహించింది. ఆకాశ గంగలో క్రతువు జరుగింది. దాతలు నారాయణం నాగేశ్వరరావు, మురళీకృష్ణ, ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి గోపురాలు, భారీ ఆంజనేయుడి విగ్రహం తదితరాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారని టీటీడీ పేర్కొంది.

 
అంజనాద్రిపై హనుమంతుని ఆలయ నిర్మాణంపై స్టే విధించాలంటూ కర్నూలు జిల్లాకు చెందిన అగ్రహారం రాఘవేంద్ర, మరో ఇద్దరు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అంజనాద్రిపై ఎలాంటి ఆలయాన్ని నిర్మించకూడదని టీటీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎండోమెంట్స్), టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

 
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది కొప్పినీడి రాంబాబు వాదనలు వినిపిస్తూ.. ఏడుకొండలపై మానవులెవరూ విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని పురాణాలు స్పష్టంగా పేర్కొన్నాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా టీటీడీ ప్రకటించి కొండపై ఆలయాన్ని నిర్మించాలని యోచిస్తోందని వాదించారు.

 
తమకు అంజనాద్రిపై గుడి కట్టే ఆలోచన లేదని, పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ తరఫు న్యాయవాది సుమంత్ అన్నారు. అంజనాద్రిపై ఆలయ నిర్మాణం చేపట్టలేదని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సుందరీకరణ పనులు మాత్రమే చేపట్టామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IIFL బ్యాంక్ మేనేజర్ చీటింగ్: క్రికెట్ బెట్టింగ్ కోసం బంగారాన్ని?