ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అయితే, ఇక్కడ సోము వీర్రాజు నియామకం కంటే... కన్నా లక్ష్మీ నారాయణను తొలగించడమే చర్చనీయాంశంగా మారింది.
నిజానికి కన్నా లక్ష్మీనారాయణను తప్పిస్తారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గత కొద్ది కాలం నుంచి కన్నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పైగా, బీజేపీ అగ్రనాయకత్వంతో విజయసాయి రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. ఇపుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో అది నిజమైందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఆరంభం నుంచి పార్టీకి విధేయంగా ఉన్నవారినే బీజేపీ కీలక స్థానాల్లో నియమించాలన్నది సంఘ్ పరివార్ ఆలోచన. ఇప్పుడు వీర్రాజుకు అదే ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. వీర్రాజుతో పాటుఎమ్మెల్సీ మాధవ్, రాయలసీమకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపించాయి. అయితే సామాజిక కారణాలతోపాటు, పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న సోమునే పదవి వరించినట్లు చెబుతున్నారు.
కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకో ఏడాదితో ముగియనుంది. 2018లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నాతో వీర్రాజు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అధిష్ఠానం వీర్రాజుకు ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించి, రాష్ట్ర అధ్యక్ష పదవిలో కన్నాను నియమించింది. ఇప్పుడు కన్నాను తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజును నియమించారు.