Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. జీఎస్టీకి మద్దతిస్తాం.. కాంగ్రెస్ మెలిక.. రంగంలోకి జైట్లీ!

Advertiesment
Rajya Sabha
, మంగళవారం, 26 జులై 2016 (09:00 IST)
నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఇందుకోసం తమ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావుతో ఓ ప్రైవేట్ బిల్లును సభలో ప్రవేశపెట్టించింది. ఈ బిల్లు ఇపుడు రాజ్యసభను ఓ కుదుపు కుదుపుతోంది. 
 
అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తు సేవల పన్ను బిల్లు (జీఎస్టీ బిల్లు)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బిల్లుకు ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఎలాగైనా ఆమోదముద్ర వేయించుకునేలా చర్యలు భావిస్తోంది. కానీ, రాజ్యసభలో 60 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఆమోదముద్ర పడకుండా మోకాలడ్డుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, జీఎస్టీ బిల్లుకు ముడిపెట్టింది. 
 
గతంలో ఎప్పుడూ ప్రత్యేకహోదా అంశాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌ అధిష్టానం... జీఎస్టీని అడ్డుకోవడానికి తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రత్యేకహోదాపై బీజేపీ వెనక్కు తగ్గడంతో ఆ పార్టీని ఇరుకున పెట్టడంతోపాటు ఏపీలో మళ్లీ పట్టుసాధించుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ నేతలు కూడా దీనికి విరుగుడు మంత్రాన్ని కనుగొనే ప్రయత్నంలో పడ్డారు. 
 
ఇందులో భాగంగా... ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్‌ జరపకుండా దాన్ని ఉపసంహరించుకునేలా చేయాలన్న ప్రయత్నాలను అధికారపక్షం మొదలుపెట్టింది. రాజ్యసభ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రంగంలోకి దిగి సొంత పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపారు. ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును సాంకేతికంగానే అడ్డుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
ద్రవ్యబిల్లులను రాజ్యసభలో నేరుగా ప్రవేశపెట్టకూడదని, ఒకవేళ ప్రవేశపెట్టినా వాటిపై ఎటువంటి ఓటింగూ జరగకూడదన్న నియమాలు ఉన్నాయని, గతంలో ఇటువంటి సంప్రదాయాలు కోకొల్లలుగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. ద్రవ్యబిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెడతారని, అలాగే ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న ప్రైవేట్ బిల్లులను కూడా తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్న నిబంధన ఉందని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు. 
 
ప్రత్యేకహోదా అంశం ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న అంశం కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవడం మినహా వేరే గత్యంతరం లేదని ఆయన వాదిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినప్పుడుగానీ, చర్చ సందర్భంలోనూ అభ్యంతరం వ్యక్తం చేయని బీజేపీ... ఇప్పుడు వింత భాష్యాలు చెప్పడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్‌లు చేసేవారి కాళ్లు, చేతులు నరికాల్సిందే.. షరియా చట్టం అమలు చేయాలి : రాజ్‌థాక్రే