రేప్‌లు చేసేవారి కాళ్లు, చేతులు నరకాల్సిందే.. షరియా చట్టం అమలు చేయాలి : రాజ్‌థాక్రే
దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు.
దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి కాళ్లు, చేతులు నరకాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కఠినతరమైన షరియా (ఇస్లామిక్) చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో ఈ నెల 13వ తేదీన 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానిక తెగబడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేశారు. ఈ మృతురాలి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించిన తర్వాత రాజ్‌థాక్రే పైవిధంగా స్పందించారు.
పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను మార్చాల్సిన అవసరముందన్నారు. సంఘవ్యతిరేకశక్తులను అదుపు చేసేందుకు షరియావంటి కఠిన చట్టాలు అమలు చేయాలని రాజ్‌థాక్రే డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.