బీజేపీకి కలిసొచ్చిన "ఈశాన్యం".... మేఘాలయలో "హస్త"వాసి
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చింది. అలాగే, మేఘాలయాలో హస్తవాసి బాగుంది. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చింది. అలాగే, మేఘాలయాలో హస్తవాసి బాగుంది. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఫలితాల ట్రెండింగ్‌లో రెండు చోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది.
కాగా, శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి వెలువడిన ఆధిక్యతలను పరిశీలిస్తే, త్రిపురలో బీజేపీ మూడింట రెండువంతులకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీని సాధించే దిశగా దూసుకెళుతోంది. అధికార లెఫ్ట్ ఫ్రెంట్ రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం 59 స్థానాలకు గాను బీజేపీ 43 స్థానాల్లో అధిక్యత కొనసాగిస్తోంది.
లెఫ్ట్ ఫ్రంట్ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేక పోయింది. కేవలం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. 2013లో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఖాతా కూడా తెరవలేదు. ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో త్రిపురలో గత 25 యేళ్లుగా కొనసాగుతున్న సీపీఎం పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడినట్టయింది.
మరోవైపు నాగాలాండ్‌లో బీజేపీ వ్యూహం ఫలించింది. ఎన్‌డీపీపీ పొత్తుతో బీజేపీ ఇక్కడ పోటీ చేసింది. ఎన్డీడీపీ-బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఎన్‌పీఎఫ్ ఆశలపై ఎన్డీపీపీ-బీజేపీ కూటమి నీళ్లు చల్లింది. ఎన్‌పీపీ 24 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌కు దెబ్బపడింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇకపోతే, మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మేఘాలయలోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మెజారిటీకి 31 స్థానాల్లో గెలుపు అనివార్యం కాగా, కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌పీపీ 11 స్థానాల్లో అధిక్యత ప్రదర్శిస్తూ రెండో స్థానంలోనూ, బీజేపీ 8 సీట్లలో అధిక్యతతో మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీకి దగ్గరులో ఉండటంతో ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.