Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే మంచిదే.. విలీనం అవసరం లేదని బాబే చెప్పారుగా?

రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే పార్టీకి ద్రోహం చేశాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వైరముండొచ్చు... కానీ తనకు వైరం లేదని మోత్కుపల్లి అన్నారు. రాజకీయ సిద్ధాంతం ప్రకారం పొత్తుపెట్టుకోవాల్సి వస్తే అది..

webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (17:04 IST)
టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన టీటీడీపీ కార్యకర్తల సమావేశానికి తనకు పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తానున్నానని... ఏపీ సీఎం చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయనకు రక్షణ కవచంగా నిలిచానని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబుకే కాకుండా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాలంలో ఆయన వద్దే వున్నానని, పదవుల కోసం ఆకాంక్షించలేదని మోత్కుపల్లి తెలిపారు. 
 
కానీ... చంద్రబాబును నానా మాటలన్నవారంతా మంత్రి పదవులు సొంతం చేసుకున్నారని.. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన తమను ఇలా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబుకు తానే అండగా నిలబడ్డానన్నారు. తన ప్రాణాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు పక్కన నిలిచానని.. తమ నాయకునికి అలాంటి సాయం చేయగలిగానని తాను గర్వపడుతున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. అలాంటి తనను పార్టీ సమావేశానికి పిలవరా? అంటూ ప్రశ్నించారు. 
 
గతంలో టీటీడీపీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళితే, ఎవ్వరూ అడగలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి వల్లనే తెలంగాణలో టీడీపీ గల్లంతైందని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై మచ్చ తెచ్చింది రేవంత్ రెడ్డేనని.. అతనిని ఆ రోజే సస్పెండ్ చేసి వుంటే పార్టీకి ఇంత గతి పట్టేది కాదని.. నామరూపాలు లేకుండా ఉన్న టీడీపీని వున్న వారు కాపాడుకోగలమని చెప్పారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే పార్టీకి ద్రోహం చేశాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వైరముండొచ్చు... కానీ తనకు వైరం లేదని మోత్కుపల్లి అన్నారు.
 
రాజకీయ సిద్ధాంతం ప్రకారం పొత్తుపెట్టుకోవాల్సి వస్తే అది.. టీఆర్ఎస్‌తోనే పెట్టుకోవచ్చునని మోత్కుపల్లి తెలిపారు. అయితే వాళ్లు పిలవకుండా మనం పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకా పార్టీని నిలబెట్టుకునేందుకు, క్యాడర్‌లో మనోధైర్యం వస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ వద్ద ఆశీర్వాదం పొందిన పార్టీ నేతలంతా టీఆర్ఎస్‌లో వున్నారని, కేసీఆర్ కూడా ఎన్టీఆర్ వద్ద ఆశీర్వాదం పొందిన వారే కావడంతో.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ విగ్రహం పెట్టుకున్నా గౌరవం వస్తుందని మోత్కుపల్లి తెలిపారు. ఇలా జరిగితే తెలుగు ప్రజలంతా హర్షిస్తారని తెలిపారు. 
 
రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిని చేయాల్సివుందని మోత్కుపల్లి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో యాత్ర చేపట్టి పార్టీని బతికించాలే తప్ప మరో దారి లేదని.. తెలంగాణలో క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాలంటే.. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకందుకు మేలే చేస్తుందని చెప్పారు. 
 
పార్టీ నిర్వీర్యం కాకుండా పది లక్షల కార్యకర్తల కోసమే పొత్తులు అవసరమని తాను అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మోత్కుపల్లి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా విలీనం అవసరం లేదు.. పొత్తులుంటాయని చెప్పారని.. మా నాయకుడు ఏది చెప్తే అది చేస్తామని.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాపాడుకుంటామని మోత్కుపల్లి తెలిపారు. 
 
అలాగే టీడీపీ విలీన వ్యాఖ్యలపై బాధపడిన కార్యకర్తలను తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే బాగుంటుందని, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీపై చంద్రబాబు కాస్త దృష్టి పెడితే పూర్వ వైభవం సాధించవచ్చునని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానికి పతనం ప్రారంభమయ్యింది... దేవుడు కూడా కాపాడలేడు... బుట్టా సంచలనం