ఫోటో కర్టెసీ: కాంగ్రెస్ పార్టీ
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ కి అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ నెంబర్ గేమ్ సాగుతోంది. మొత్తమ్మీద తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైనంత బలం సమకూరుతుందన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ వుంది. తమ పార్టీకి పూర్తి ఆధిక్యం రావాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ పూజలు కూడా చేస్తున్నారు.
అదలా వుంచితే... రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేపట్టిన Bharat Joda Yatra ప్రభావం కర్నాటక ప్రజలపై వుందన్న వాదనలు వినబడుతున్నాయి. ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ 136 రోజుల పాదయాత్ర చేసారు. ఆ యాత్ర కాశ్మీరులో జనవరి 30, 2023న ముగిసింది. ఈ యాత్ర సమయంలో ప్రజలను నేరుగా కలుసుకుని మాట్లాడారు రాహుల్.
దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటక రాష్ట్ర పరిస్థితి భిన్నంగా వుంటుంది. దేశంలో చాలాచోట్ల భాజపా హవా సాగుతున్న తరుణంలోనే అక్కడ హస్తం పాగా వేసింది. ఆ తర్వాత అనేక రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తిరిగి భాజపా అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన హవాను చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
దూసుకుపోతున్న కాంగ్రెస్-114 చోట్ల ఆధిక్యం, చతికిలబడ్డ భాజపా
కర్నాటకలో హస్తం హవా సాగుతున్నట్లు కనబడుతోంది. అధికార భాజపాకు భంగపాటు తప్పదన్నట్లు ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టి అర్థమవుతుంది. కర్నాటకలో మొత్తం 224 చోట్ల ఎన్నికలు జరుగగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వెళుతోంది.
ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ 114 చోట్ల ఆధిక్యంలో వుంది. భాజపా 72 చోట్ల, జేడీఎస్ 30 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 8 చోట్ల ముందంజలో వున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి.