తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా... అంటూ ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లోకి ఓ ప్రభంజనంలా దూసుకొచ్చారు. ఆయన ధాటికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏపీ నుంచి కూకటివేళ్లతో సహా కూలిపోయింది. మళ్లీ తిరిగి పూర్తిస్థాయిలో అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకూ ఆగాల్సి వచ్చింది.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చింది. కానీ ఏనాడూ కాంగ్రెస్ పార్టీతో మాత్రం జతకట్టలేదు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టడంతో తెదేపాకి చెందిన ఒక వర్గం ఆ పార్టీకి దూరమైపోయింది. ఫలితంగా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది.
ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే వైసీపీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ యువకుడు కూడా కావడంతో అధికారులను పరుగులు పెట్టిస్తూ సుదీర్ఘమైన సమీక్షలకు చెక్ పెట్టేసి లఘు సమీక్షల్లోనే తేల్చేస్తున్నారు. దీంతో అధికారులకు కావాల్సినంత టైం మిగులుతోంది. పైగా అధికారులను అక్కడికి ఇక్కడికీ తిప్పకుండా ఏకంగా ఇంట్లోనే సమీక్షలు చేసి వారికి భోజనం కూడా పెట్టి పంపిస్తున్నారు. దీనితో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఏపీలో జగన్ పరిస్థితి ఇలావుంది.
తెదేపా పరాజయం పాలవడంతో కార్యకర్తల నుంచి నాయకుల వరకూ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్లు కనబడుతోంది. జెసీ లాంటి నాయకులైతే తాము రాజకీయ సన్యాసులమయ్యామంటూ ప్రకటించేస్తున్నారు. మరికొందరు పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిపాదనలను తోసిపుచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా కేంద్రంలో అధికారంలో వున్న భాజపాలో చేరిపోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదంతా చూస్తుంటే తెదేపా పరిస్థితి భవిష్యత్తులో మరింత దిగజారిపోతుందనే వాదన వినిపిస్తోంది. పార్టీలోని కార్యకర్తలకు మంచి ఊపునిస్తూ పూర్వవైభవం రావాలంటే అది నందమూరి తారక రామారావు... జూ.ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటూ వాదన వస్తోంది. పార్టీ పగ్గాలను యువరక్తానికి అప్పగిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.