#GES2017 : రారండోయ్... వేడుకలు చూద్దాం...
భాగ్యనగరం రెండు పండుగలకు ఆతిథ్యమివ్వనుంది. అందులో ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవం కాగా, మరొకటి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017. జీఈఎస్ తరహా సదస్సు మొత్తం దక్షిణాసియాలోనే తొలుత హ
భాగ్యనగరం రెండు పండుగలకు ఆతిథ్యమివ్వనుంది. అందులో ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవం కాగా, మరొకటి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017. జీఈఎస్ తరహా సదస్సు మొత్తం దక్షిణాసియాలోనే తొలుత హైదరాబాద్‌లో జరుగుతుండటం విశేషం. ఈ రెండింటికీ భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. దీనికితోడు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదీల చిరకాల కోరికగా ఊరిస్తూ వస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఈ రెండు మహా ఘట్టాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు విశ్వవ్యాప్తంగా దాదాపు 140 దేశాల నుంచి 1500 మంది అతిథులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. అలాగే, అంతర్జాతీయ మీడియా కూడా నగరానికి చేరుకుంది. కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, వారికి సరైన చేయూతను అందించేందుకుగాను అమెరికా - భారత ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నాయి.
మంగళవారం (28న) ప్రారంభమయ్యే ఈ సదస్సు ఈ నెల 30వరకు కొనసాగనుంది. ఈ ఏడాది నిర్వహించే ఈ జీఈఎస్ సదస్సులో 'విమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ఊతం అందించి వారు ప్రపంచ వృద్ధిలో పాలు పంచుకొనేలా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సదస్సులో అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో ఆధునిక పరిణామాలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఎదురవుతున్న అవరోధాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు.