ఆనాడు 'అన్న'గా జేజేలు అందుకున్న ఎన్టీఆర్... ఈనాడు 'తమ్ముడు'గా ఆశీర్వాదాలందుకుంటున్న పవన్...
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. సుప్రసిద్ధ సినీ నటునిగా, రాజకీయ నాయకునిగా రెండు రంగాలలోను తనదైన ప్రత్యేక ముద్రతో ముందుకు సాగుతున్న నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సెప్టెంబరు 2. కొణెదల వెంకట్రావు, అంజనీదేవిలకు సెప్టెంబరు 2, 1971లో పవన్ జన్మించారు
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. సుప్రసిద్ధ సినీ నటునిగా, రాజకీయ నాయకునిగా రెండు రంగాలలోను తనదైన ప్రత్యేక ముద్రతో ముందుకు సాగుతున్న నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సెప్టెంబరు 2. కొణెదల వెంకట్రావు, అంజనీదేవిలకు సెప్టెంబరు 2, 1971లో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవి ప్రోత్సాహంతో 1996వ సంవత్సరంలో అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 20 సంవత్సరాలలో 21 చిత్రాలను చేశారు.
ప్రారంభంలో మెగాస్టార్ సోదరునిగా గుర్తింపు పొందిన ఆయన ఆ తరువాత తన వ్యక్తిగత, సినీ ఛరిష్మాతో పవన్ అన్నయ్యే చిరంజీవి అనే స్థాయికి ఎదగడం విశేషం. ఖుషీ చిత్రం తరువాత దాదాపు 12 ఏళ్ళ పాటు ఒక్క బ్లాక్‌బాస్టర్ హిట్ పవన్ ఖాతాలో నమోదు కానప్పటికీ సినీ ప్రేక్షకులలో పవన్‌కున్న ఇమేజ్ మాత్రం తగ్గలేదు. గబ్బర్ సింగ్‌తో పవన్ మళ్ళీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకున్నారు. సినిమాల జయపజయాలకు సంబంధం లేని పాపులారిటీ ఆయనది.
అన్నయ్య చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అన్నకు అండగా ఒక సైనికునిలా పవన్ పనిచేశారు. ఆ పార్టీ టికెట్ల పంపకంలో చోటుచేసుకున్న అంశాలు పవన్‌కు నచ్చలేదు. ప్రజారాజ్యం పార్టీ ఓటమి తరువాత పవన్ మౌనంగా ఉండిపోయారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భంలోను పవన్ స్పందించలేదు. పవన్‌లో నిగూఢంగా అంతర్మథనం జరుగుతుందని అడపాదడపా మీడియా కథనాలను ప్రచురిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆంధ్రరాష్ట్ర విభజన సందర్భంలో చోటుచేసుకున్న రాజకీయ అంశాలు మళ్ళీ పవన్‌ను రాజకీయాల వైపుకు నడిపించాయి.
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి తన ఆవేశపూరితమైన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్దులను చేశారు. చిరంజీవి లేని రాజకీయ లోటును పవన్ తీర్చడానికి ముందుకు రావడంతో ప్రజారాజ్యం ఓటమి, కాంగ్రెస్ విలీనంతో నిరాశతో ఉన్న క్యాడర్‌కు పవన్ మళ్ళీ నూతన ఉత్సాహనిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ వ్యూహంతో వ్యవహరించి బిజెపి – తెదేపా కూటమికి మద్ధతు పల్కి, తన అన్న రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై సమరశంఖాన్ని పూరించాడు.
ప్రజల కోసం ప్రాణం కంటే అధికంగా ప్రేమించే అన్నయ్య చిరంజీవి కుటుంబానికి పవన్ దూరమయ్యారు. పవన్ మద్ధతుతోనే రాష్ట్రంలో మారిన కుల సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నదనేది అంగీకరించదగ్గ వాస్తవం. ఎన్నికల అనంతరం రెండు, మూడు సందర్భాలలో మాత్రమే పవన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ సంబంధమైన అంశాల పట్ల స్పందించారు. ఈ దిశలో చాలామంది పవన్ పైన విమర్శలు చేశారు. కేంద్రం ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హామీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న సందర్భంలో పవన్ మళ్ళీ బయటకు వచ్చి తన నిరసన గళాన్ని విప్పి మళ్ళీ వార్తలలో నిల్చారు.
పేదలకు గుండె ఆపరేషన్లు చేయించడానికి తనకు ఎంతో ఇష్టమైన, అత్యంత ఖరీదైన కారునే అమ్మిన సహృదయత పవన్‌కే సొంతం. పవన్ చేసిన సహాయాలు, సేవలు ఆయన చేసిన ఎన్నాళ్ళకో బయటకు తెలిసినవే. ప్రచారాలు ఆశించకుండా చేయూతనందించే మనస్తత్వం ఆయనది. వ్యక్తిగా – రాజకీయ నాయకునిగా తెలుగు ప్రజలు చిరంజీవి కంటే పవన్‌నే ఎక్కువగా నమ్ముతున్నారు. ఆరాధిస్తున్నారు. ఇందుకు పవన్ గడిపే ఆడంబర రహిత జీవనం, ప్రజల్లో మమేకం కావడం, అభిమానుల కోసం కదిలి రావడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం, సామాజిక సేవాతత్ఫరులకు – అభాగ్యులకు ఆర్థిక సహాయం చేయడం తదితర అంశాలు పవన్‌ను ప్రజలు ఆరాధించేలా చేశాయి. నమ్మేటట్లు చేశాయి.
చిరంజీవి, నాగేంద్రబాబులు సైతం వ్యక్తిగతంగా పవన్ ఆలోచనలను, అతని దృక్పథాన్ని అనేక సభలలో ఎంతగానో ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. సినీరంగంలో చిరంజీవికి అంటే అసలు గిట్టని దాసరికి పవన్ అంటే అభిమానం. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ సైతం ట్వీట్ల్ ద్వారా పవన్ మంచితనాన్ని, సహృదయతను చాటడం విశేషం. పవన్ ఇప్పుడొక సమూహిక ప్రజాశక్తి. ఆయన పిలుపే ఒక ప్రజా ప్రభంజంనం అనడానికి తిరుపతిలో జరిగిన సభే ఒక మచ్చుతునక. తెలుగు ప్రజల సినీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా పవన్ భవిష్యత్తులో రాణించాలని ఆయన జన్మదిన శుభ సందర్భాన అందరం ఆశిద్దాం. ఆనాడు 'అన్న' అని ఎన్టీఆర్‌ను ఆత్మీయంగా పిలుచుకున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు 'తమ్ముడా' అని పిలుచుకునే ఓ నిఖార్సయిన నాయకుడు దొరికాడని అనడంలో అతిశయోక్తి లేదు.