Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టమా? కష్టమా?

Advertiesment
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టమా? కష్టమా?
, శుక్రవారం, 7 మే 2021 (17:15 IST)
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తి కలిగించే వార్తే. తాజాగా జూనియర్ పెళ్లిరోజు సందర్భంగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ పుంజుకోకపోవడం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక ఎన్నికల వరకు పార్టీ ప్రాభవం తగ్గిపోతూ ఉండటంతో టీడీపీకి మెరుగైన నాయకత్వం కావాలని ఆశిస్తున్నారు కార్యకర్తలు. ఆమధ్య కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావడం గమనార్హం. అయితే కార్యకర్తల డిమాండ్లను చంద్రబాబు వినీ విననట్టుగా ఉన్నా.. ఆ తర్వాత పార్టీలో పెద్ద చర్చ జరిగిందని అంటారు.
 
ఎన్టీఆర్ రీఎంట్రీ ఎంతమందికి ఇష్టం..?
నారావారి చేతుల్లో నుంచి నందమూరి వారి చేతుల్లో టీడీపీని పెట్టడం చంద్రబాబుకి సుతరామూ ఇష్టం లేదు. అందుకే ఆయన లోకేష్ ఒక్కరే పార్టీకి భావి నాయకుడు అనేలా సీన్ క్రియేట్ చేశారు. బాలకృష్ణ సహా నందమూరి వారసులెవరూ పార్టీపై చంద్రబాబుకి ఎదురు చెప్పకుండా చేసుకున్నారు.

బాలకృష్ణ కూడా తన అల్లుడికే టీడీపీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎన్టీఆర్ టీడీపీలో క్రియాశీలకంగా మారితే కచ్చితంగా అది లోకేష్‌కి ఇబ్బందికరంగా ఉంటుందనేది చంద్రబాబు, బాలకృష్ణ ఆలోచన. అందుకే వారెప్పుడూ ఎన్టీఆర్‌ని టీడీపీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదు. తమకి తాముగా జూనియర్‌ని హైలెట్ చేయాలనుకోలేదు.
 
ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. సొంత సోదరి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదంటే.. రాజకీయాలకు ఆయన ఎంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారో అర్థమవుతుంది. అయితే అదే సమయంలో తాత పెట్టిన పార్టీకి పునర్వైభవం తేవడం కూడా ఎన్టీఆర్ బాధ్యత అనేవారు కూడా ఉన్నారు.

ఇది జరగాలంటే.. ఎన్టీఆర్‌కి టీడీపీలో బలమైన మద్దతు కావాలి. ఆ మద్దతు చంద్రబాబు నుంచి ఊహించలేం. బాలకృష్ణ, ఎన్టీఆర్‌కి మద్దతుగా నిలిచి, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తే.. ఎన్టీఆర్ రీఎంట్రీ సాధ్యమవుతుందనేది కొంతమంది వాదన. అయితే ఇది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు.

సాఫీగా సాగిపోతున్న సినిమా కెరీర్‌ని పణంగా పెట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం కష్టం. సినీ, పొలిటికల్ కెరీర్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాల్సినంత అవసరం ఇప్పుడు ఎన్టీఆర్‌కి లేదు. మొత్తమ్మీద ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడనేది పార్టీ డిమాండ్ పైనే ఆధారపడి ఉంటుంది, బాలకృష్ణ మద్దతు కూడా దానికి బాగానే అవసరం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి? వేసుకున్నవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?