Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వడ్డికాసులవాడికి నోట్ల రద్దు దెబ్బ... లోటు బాటలో తితిదే ఖజానా

'నిత్య కల్యాణం.. పచ్చతోరణం' అని శ్రీవారి గురించి ఘనంగా చెప్పుకుంటాం. కుబేరుడి బాకీ నుంచి విముక్తుడిని చేయడానికి తరతరాలుగా భక్తులు సమర్పిస్తున్న వడ్డీ కాసులతో వెంకన్న వైభవం ఇన్నాళ్లూ జోరుగా సాగింది. అయ

Advertiesment
Demonetization Effect
, ఆదివారం, 9 జులై 2017 (15:32 IST)
'నిత్య కల్యాణం.. పచ్చతోరణం' అని శ్రీవారి గురించి ఘనంగా చెప్పుకుంటాం. కుబేరుడి బాకీ నుంచి విముక్తుడిని చేయడానికి తరతరాలుగా భక్తులు సమర్పిస్తున్న వడ్డీ కాసులతో వెంకన్న వైభవం ఇన్నాళ్లూ జోరుగా సాగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు వేడి... ఇప్పుడు ఏడు కొండలవాడినీ తాకింది. ఫలితంగా ఈ యేడాది జనవరి నుంచి ఆయన ఆదాయం గణనీయంగా పడిపోయింది.
 
అంతేకాదండోయ్... తితిదే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లోటు బడ్జెట్‌లోకీ వెళ్లిపోయింది. ఈ యేడాది రాబడికి ఖర్చుకు మధ్య రూ.300 కోట్ల దాకా తేడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా టీటీడీలో వారంలోపే బిల్లుల చెల్లింపులు జరిగిపోతాయి. ఆదాయం తగ్గడంతో చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. టీటీడీ ఇంజనీరింగ్‌, మార్కెటింగ్‌ విభాగంలో రూ.60 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటమే దీనికి నిదర్శనం.
 
దీనికి ప్రధాన కారణం హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడమే. 2015-16లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.905 కోట్లు. 2016-17లో అది రూ.1,110 కోట్లకు పెరిగింది. ఈ యేడాది హుండీ ఆదాయం పెరగకపోయినా, గత యేడాది మేరకు ఆదాయం వస్తే చాలని భావిస్తున్నారు. సగటున నెలకు వందకోట్ల దాకా రావాల్సిన హుండీ కలెక్షన్‌.. గత ఆరునెలల్లో ఏనాడూ వందకోట్లకు చేరక పోవడం గమనార్హం. 
 
టీటీడీకి సగటున రోజుకు రూ.3.04 కోట్లు రావాల్సి ఉండగా, గత ఆరు నెలలుగా రూ.2.44 కోట్లకే పరిమితమైంది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 556 కోట్ల హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేయగా, 447.84 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 108 కోట్లు లోటు. 
 
అలాగే, టీటీడీకి ఇతర ఆదాయవనరుల్లో దర్శన టిక్కెట్లు.. తలనీలాల విక్రయాలు ముఖ్యమైనవి. అంతర్జాతీయ విపణిలో తలనీలాల ధర పతనమైంది. 2015-16లో తలనీలాల విక్రయం ద్వారా రూ.200 కోట్లు రాగా.. గత ఏడాది అది రూ.150 కోట్లకు తగ్గిపోయింది. 
 
టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో కోతపడింది. నోట్ల రద్దీ వల్ల గడచిన 80 రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడంతో మరో రూ.12 కోట్ల ఆదాయం తగ్గింది. 300 రూపాయల టికెట్ల ద్వారా ఈ ఏడాది రూ.256 కోట్లు వస్తే గొప్పని భావిస్తున్నారు. దీనికి కారణం రూ.300 విలువ చేసే టిక్కెట్ ధర కొంటున్నవారి సంఖ్య 15 వేలకు పడిపోయింది. కాలినడక భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 
 
ఇకపోతే... భక్తులకు ఇచ్చే లడ్డూలు టీటీడీకి పెనుభారంగా మారాయి. భక్తులకు, తితిదే ఇచ్చే ఉద్యోగులకు ఇచ్చే లడ్డూల రాయితీల వల్ల ఏటా టీటీడీ రూ.250 కోట్ల నష్టాన్ని భరిస్తోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది హుండీ ద్వారా రూ.890 కోట్లు మాత్రమే వస్తాయని, అంటే రూ.220 కోట్లు నష్టం ఏర్పడుతుందనీ అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాకు చెక్ : రిపబ్లిక్ వేడుకలకు 10 దేశాధినేతలు.. మోడీ నిర్ణయం