Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలాకోట్‌లో ఉగ్రవాదులపై దాడి జరిగిందా..? లేదా?

Advertiesment
Balakot Attack
, బుధవారం, 6 మార్చి 2019 (18:16 IST)
బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన ఎయిర్ స్ట్రయిక్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ వైపు రకరకాల సంఖ్యలు చెప్తూ తాజాగా లెక్కతేలాల్సి ఉందని సెలవిచ్చేసి సరిపుచ్చేసుకుంది. ఇక ప్రతిపక్షమైతే ఈ వైమానిక దాడులు, యుద్ధ వాతావరణం కల్పించడం వంటివన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భాజపా చేస్తున్న కుట్రగా ఆరోపిస్తుంటే, విపక్షాలు రక్షణ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని అధికార పక్షం ఎదురుదాడికి దిగుతోంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. 
 
మరోవైపుకి వస్తే... పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలు ఉగ్రవాదుల మృతదేహాలను చూపాలని డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడిలో షామిలికి చెందిన ప్రదీప్‌కుమార్, మైన్‌పురికి చెందిన రాంవకీల్‌లతో పాటు మొత్తం 43 మంది అమరులైన విషయం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై దాడి పేరుతో పాక్ భూభాగంలోకి యుద్ధవిమానాలను పంపి, వేల టన్నుల పేలుడు పదార్థాలను గుమ్మరించినట్లు వార్తలు వెలువడ్డాయి. 
 
ఈ దాడిలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో మరణించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసేసుకుంది. కాగా... అంతర్జాతీయ మీడియాలలో ఇందుకు విరుద్ధమైన కథనాలు వెలువడుతూ... కూల్చివేసామని చెప్తున్న మదరసాల ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య ఆ ఇద్దరు జవాన్ల కుటుంబాలు కూడా ఉగ్రవాదులు మరణించినట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
సాక్ష్యం చూపేంతవరకు ఎలా నమ్మగలము? పాకిస్థాన్ కూడా అసలు ఎలాంటి నష్టమూ జరుగలేదని పేర్కొనడం ఇక్కడ విశేషం. ఒకవేళ ఉగ్రవాదులు మరణించడం నిజమే అయినట్లయితే, పుల్వామా దాడి తరహాలో విరిగిన కాళ్లూ చేతులు, మొండాల ఫొటోలు రావాలి కదా? సరైన ఆధారాలు లేకుండా ఉగ్రవాదులు చనిపోయినట్టు నమ్మడానికి మేం సిద్ధంగా లేము. రుజువు చూపితేనే మా అమరవీరుల బలిదానానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు మేము నమ్ముతాము.. అని రాంవకీల్ సోదరి రాంరక్ష తేల్చిచెప్పింది. అటు షామిలిలో ప్రదీప్‌కుమార్ తల్లి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. టీవీలో ఉగ్రవాదుల మృతదేహాలు చూపితేనే కదా నమ్మగలిగేది అని ఆమె నిలదీస్తున్నారు. 
 
మొత్తంమీద ఈ వివాదం ప్రభుత్వానికి ఇరకాటంగా తయారైంది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ సభలో మాట్లాడుతూ 300 మొబైల్ ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ ఎన్టీఆర్వో తెలిపిందనీ, మరి ఆ 300 సెల్‌ఫోన్లు మనుషులు కాక చెట్లు ఉపయోగిస్తాయా? అని ప్రశ్నించారు. కానీ మృతుల వివరాలపై ఖచ్చితమైన లెక్కలను ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను పిలువకుండా మీరు మద్యం తాగుతారా అన్నందుకు చంపేశారు...