హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేసే ప్రియురాలిపై జొమాటోలో పని చేసే ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేసేలా చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన వాసవి అనే యువతి, గణేశ్ అనే యువకుడు గచ్చబౌలికి ఉంటూ... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో వాసవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరగా, గణేశ్ మాత్రం జొమాటోలో చేరాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరూ ప్రతి రోజూ సాయంత్రం కలుసుకుంటూ వచ్చారు.
మంగళవారం రాత్రి నార్సింగిలోని టీ గ్రిల్ హోటల్ వద్దకు రావాలని గణేశ్ పిలిచాడు. దీంతో ఆమె హోటల్ వద్దకు వచ్చింది. కొంతసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఘర్షణపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన గణేశ్.. తన బ్యాగులోని కత్తిని తీసి... వాసవిపై దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో ఆమె మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... పరారీలో ఉన్న గణేశ్ కోసం గాలిస్తున్నారు.
పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని చంపేసిన తనయుడు.. ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. పాకెట్ మనీ ఇవ్వలేదన్న అక్కసుతో కన్నతండ్రిని కుమారుడు కిరాతకంగా చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దేపాల్ పూర్ ప్రాంతానికి చెందిన బాబు చౌదరి అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయన ఈ నెల 15వ తేదీన పొలంలో విగతజీవిగా కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఈ కేసులో నిందితుడు మృతుని కుమారుడే అని నిర్ధారించారు.
దీంతో బాబు చౌదరి కుమారుడు సోహాన్ (25)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. గత కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటుపడిన సోహాన్... పాకెట్ మనీ కోసం తండ్రిని డబ్బులు అడిగాడు. అందుకు ఆయన నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సోహాన్.. తండ్రిపై దాడి చేశాడు. బాబు చౌదరి తలపై పెద్ద బండరాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని నిందితుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సోహాన్‌ను అరెస్టు చేశారు.