వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినినులపై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఆర్జీకర్ వైద్య కాలేజీ, కోల్‌కతాలో న్యాయ కాలేజీలో విద్యార్థినిలపై జరిగిన అత్యాచార ఘటనలు మరిచిపోకముందే తాజాగా ఐఐఎం కోల్‌కతాతో చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ విద్యా ప్రాంగణంలోని మెన్స్ హాస్టల్‌లో ఈ దారుణం జరిగింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తాను మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తనకు కౌన్సెలింగ్ చేస్తానని చెప్పి శుక్రవారం బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతడు ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని ఏం జరిగిందో తెలియలేదని వాపోయింది.
స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించానని తెలిపింది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా.. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ విద్యార్థి తనను బెదిరించినట్లు ఆమె వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.