పెళ్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సివుండగా, వధువును వరుడు హత్య చేసాడు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివాహ ముహూర్తపు చీర కట్టుకునే విషయంలో వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన వరుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సాజన్ బరయ్య అనే యువకుడు సోని రాథోడ్ అనే యువతితో ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది.
వివాహానికి గంట ముందు పెళ్లి చీర, డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాజన్ సోనిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అనంతరం ఆమె తలను గోడకేసి బలంగా కొట్టడంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
దీంతో భయాందోళనకు గురైన నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా కనిపించిన పెళ్లింట విషాద చాయలు అలముకున్నాయి.