ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతల వేధింపులు తాళలక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు మృతుడు సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకున్నాడు.
చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 11వ వార్డు పరిధిలోని జోగుల కాలనీలో ఉండే శరవణ అనే వలంటీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇదే వార్డుకు చెందిన వైకాపా నేత సయ్యద్ తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
సయ్యద్‌కు రూ.8.2 లక్షల మేరకు అప్పుగా ఇచ్చానని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే తాను వైకాపా ఎమ్మెల్యే మనిషినంటూ సయ్యద్ బెదిరిస్తున్నాడని తెలిపారు. పైగా, తీసుకున్న అప్పు చెల్లించకుండా మానసికంగా వేధించాడని, తనకు మరోమార్గం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ఈ కేసును స్థానిక పోలీసులు నీరుగార్చే ప్రయత్నాలు అపుడే మొదలుపెట్టారు. తన కుమారుడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.