Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య - అత్తింటివారిపై లండన్ నుంచి విష ప్రయోగం.. ఎలా?

poison
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (12:26 IST)
భార్యతో విభేదాల కారణంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో ఓ వ్యక్తి లండన్ నుంచే విష ప్రయోగం చేయించాడు. ఈ విషయం వెలుగులోకి రాకముందే అత్త ప్రాణాలు కోల్పోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర మొత్తం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌కు చెందిన హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డా.శిరీష. ఈమెకు గత 2018లో టెక్కీ అయిన ఎం.అజిత్ కుమార్‌తో పెళ్లి జరిగింది. ఉద్యోగరీత్యా ఇరువురు లండన్‌లోనే స్థిరపడ్డారు. వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే, కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో ఆమె లండన్‌లోనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. 
 
ఈ సంఘటన తర్వాత భార్యపై కోపం పెంచుకున్న అజిత్ కుమార్.. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులందర్నీ అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చాడు. తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు లండన్‌లోనే తన వద్ద పనిచేసే వినోద్ కుమార్‌ను ఒప్పించాడు. వీరిద్దరికీ మిత్రులైన హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్, అశోక్, గోపినాథ్‌పాటు అజిత్ స్నేహితుడు, శిరీష బంధువైన పూర్ణేంద్ర రావులతో కలిసి కుట్రపన్నాడు. 
 
ఈ క్రమంలో సోదరుడి వివాహానికి లండన్ నుంచి శిరీష, ఆమె కుమార్తె హైదరాబాద్ వెళ్లడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. అత్తారింటిపై నిఘా ఉంచేలా వాచ్‌మెన్ కుమారుడు రమేష్‌కు డబ్బు ఆశ చూపి.. తన దారికి తెచ్చుకున్నాడు. తమ పథకంలో భాగంగా, జూన్ 25వ తేదీన తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా... హత్యాయత్నం విఫలమైంది. ఆ తర్వాత తమ ప్లాన్ మార్చారు. వారింట్లో గుర్తుతెలియని విషం కలిపిన మసాలా పొడులు, పసుపు, కారం వంటి వాటిని శాంపిల్ ప్యాకెట్లుగా డెలివరీబాయ్ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ క్రమంలోనే శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మృతి చెందారు. అందుకు ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయి... కోలుకోకపోవడంతో అనుమానమొచ్చి రక్త నమునాలను పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు తేలింది. దాంతో శిరీష గురువారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మాదాపూర్ జోన్ డీసీపీ సందీపావు... మియాపూర్ సీఐ ప్రేమ్‌ కమార్, ఎస్ఐలు వెంకటేష్, జగదీష్, కానిస్టేబుళ్లు విజయేందర్ రెడ్డి, విఠల్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ విచారణ బృందాలు అపార్టుమెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి... వాచ్‌మన్ కుమారుడు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... అదే అపార్టు‌మెంట్లో శిరీష ఫ్లాట్‌పైన పూర్ణేందర్ రావు పేరును చెప్పాడు. దాంతో మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి, రిమాండు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్ కుమార్‌ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ.. కాలయముడైన భర్త...