Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య వెంటపడుతున్నాడనీ సీఐ హత్య చేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

murder
, గురువారం, 9 నవంబరు 2023 (11:58 IST)
తన భార్య వెంటపడుతున్నడాన్న అక్కసుతో సీసీఎస్ విభాగంలో పనిచేసే సీఐను ఓ కానిస్టేబుల్ తన ఇంట్లో పనిపిల్లోడు, భార్యతో కలిసి హత్య చేశాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో ఈ హత్య జరిగింది. సంచలనం సృష్టించిన ఈ కేసులోని నిజాలను పోలీసులు తమ విచారణలో నిగ్గు తేల్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబ్ నగర్ మొదటి పట్టణ ఠాణా కానిస్టేబుల్ జగదీశ్, ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శకుంతల భార్యాభర్తలు. 2009 బ్యాచ్‍‌కు చెందిన వీరు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా పని చేస్తున్న ఇస్తేకార్ అహ్మద్, మహిళా పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్‌గా ఉన్న శకుంతలతో పరిచయం ఏర్పడింది. అనంతరం బదిలీపై వెళ్లిపోయిన అహ్మద్.. గత ఏడాది డిసెంబరు 10న తిరిగి మహబూబ్ నగర్‌‍కు బదిలీ అయ్యాడు. 
 
అప్పటి నుంచి శకుంతులు చరవాణికి సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. మార్చి 8న జగదీశ్ తన భార్యతోపాటు సీఐ అహ్మద్‌కు ప్రవర్తన మార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన రాత్రి జగదీశ్ విధులకు వెళ్తూ ఎవరైనా తన ఇంటికొస్తే ఫోన్ చేసి వివరాలు చెప్పాలని తన ఇంట్లో సహాయకుడిగా ఉన్న కృష్ణకు సూచించాడు. ఉప్పునుంతలకు చెందిన కృష్ణ చిన్నప్పటి నుంచి వారి వద్దే పెరుగుతూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేవాడు. 
 
జగదీశ్ విధులకు వెళ్లగా, అదేరోజు రాత్రి ఇంటికి వస్తానని శకుంతలకు సీఐ మెసేజ్ పంపాడు. తన భర్త ఇంట్లోనే ఉన్నాడని ఆమె రిప్లై ఇచ్చింది. అయినా రాత్రి 11.20 గంటలకు ఆమె నివసించే మర్లు సమీపంలోని ఎస్ఆర్ నగర్‌కు కారులో వచ్చాడు. ఇంటికి సమీపంలోనే కారు ఆపి, నడుచుకుంటూ వెళ్లి తలుపుకొట్టాడు. ఇది గమనించిన కృష్ణ వెంటనే జగదీశ్ సమాచారం అందించాడు. తలుపు తీసిన శకుంతల సీఐతో మాట్లాడుతుండగా.. జగదీశ్ ఆవేశంగా వచ్చి సీఐపై దాడికి పాల్పడ్డాడు. కృష్ణ కూడా అతనికి సహకరించాడు. వారిని నెట్టి రోడ్డుపైకి వచ్చిన సీఐపై మళ్లీ దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం సీఐ కారులోనే వెనుక సీటులో కూర్చోబెట్టారు.
 
తర్వాత ఏదైనా ఖాళీ ప్రదేశం చూడాలని కృష్ణకు చెప్పి జగదీశ్ తిరిగి ఠాణాకు వెళ్లాడు. తాను విధుల్లోనే ఉన్నానని నమ్మించడానికి అక్కడి ఏఎస్ఐతో ఫొటో దిగి పోలీస్ గ్రూపులో పోస్టు చేశాడు. అప్పటికే కారును కొంతదూరం తీసుకెళ్లిన కృష్ణ అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్లీ జగదీశ్‌తో కలిసి నడుచుకుంటూ కారు వద్దకు తెల్లవారుజామున 3.36 గంటలకు వెళ్లారు. సీఐని బయటకు దించి, పెద్దరాయితో తలపై మోదారు. సీఐ దుస్తులు తీసేసి కత్తితో ఒంటిపై విచక్షణారహితంగా గాట్లు పెట్టారు. కత్తిని అక్కడే ఓ డ్రైనేజీలో పడేశారు. 
 
అనంతరం ఇంటికి చేరుకొని శకుంతలకు విషయం చెప్పగా.. రక్తపు మరకలు పడిన వారి దుస్తులను కాల్చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. గురువారం ఉదయం ఆమె అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పడంతో ఎస్పీకి, సీఐకి ఫోన్ చేసి వివరించింది. అనంతరం ముగ్గురూ ఇంట్లో నుంచి పరారయ్యారు. అప్పటికే ఉదయం నడకకు వచ్చిన వారు కారులో ఉన్న సీఐని గమనించి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అప్పటి నుంచి హైదరాబాద్‍‌లో చికిత్స పొందుతూ వచ్చిన సీఐ మంగళవారం మృతిచెందారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు జగదీశ్, శకుంతలను నగరంలోని ఓ నర్సరీ వద్ద పట్టుకున్నారు. యువకుడు కృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు