వరంగల్‌లోని కాకతీయ వైద్య కాలేజీలో అనస్థీషియా విభాగం విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి ఆత్మహత్యా యత్నం కేసులో పోలీసులు సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ప్రీతిని వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు.
కాగా, ముట్టెవాడ పోలీసులు సైఫ్‌ను శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ బోనాల కిషన్ వెల్లడించారు. ఈ కేసులో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అదేసమయంలో ప్రీతిని వేధించినట్టుగా సైఫ్ మొబైల్ నుంచి పలు కీలకమైన ఆధారాలను కనుగొన్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పారు.
ఇదిలావుంటే, వైద్య విద్యార్థిని ఆత్మహత్యయత్నం కేసులో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ముట్టెవాడ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఆయన వెంట ఏసీపీతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మరోవైపు తమ కుమార్తెను బతికిస్తే కూలిపని అయినా చేసుకుని జీవిస్తామంటూ ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ప్రాధేయపడుతున్నారు.