హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అన్న కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే...
మచ్చబొల్లారం పరిధిలో నివసించే నిందితుడు(37) తన సోదరుడి కుమార్తె(18)ను పెంచుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివసించే భవన నిర్మాణ కార్మికుడు ప్రకాశ్ కుమారుడు ప్రదీప్ ప్రేమిస్తుండటంతో రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగాయి.
ఈ క్రమంలో సంక్రాంతి రోజున ప్రదీప్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిందితుడు పథకం వేసుకున్నాడు. ఇందుకు అతని స్నేహితులు పవన్ కల్యాణ్, ఎల్లేన్లు సహకరించారు. సంక్రాంతి రోజు రాత్రయినా ప్రదీప్ ఆచూకీ లభించలేదు. అప్పటికే ఆవేశంలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రదీప్ తల్లిదండ్రులు ప్రకాశ్, హేమలతపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు కాగా.. హేమలత ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటన స్థలంలో ఆడుకుంటున్న పక్కింటి బాలిక చాందినికి మంటలు అంటుకొని గాయపడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని గురువారం పట్టుకున్నారు. అతనికి సహకరించిన పవన్ కల్యాణ్, ఎల్లేట్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.