నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తను నమ్మిన ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అత్యాచారం చేసి ఆమెను దారుణంగా పొడిచి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నల్గొండ రూరల్ పోలీసు స్టేషను పరిధిలోని అన్నారెడ్డిగూడెంకి చెందిన 17 ఏళ్ల బాలిక జిల్లా కేంద్రంలోని ఓ కాలేజీకి రోజూ వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమెకి గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఆరు నెలలుగా వీరిరువురూ చనువుగా తిరుగుతున్నారు.
ఐతే మంగళవారం నాడు కళాశాలకు వెళ్లాల్సిన బాలిక గడ్డం కృష్ణ పిలుపు మేరకు అతడి స్నేహితుడికి ఇంటికి వెళ్లింది. అక్కడ బాలికను లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరిమధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవ కారణంగా అతడు ప్రియురాలిని హత్య చేసి పరారయ్యాడు. ఐతే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడమే కాక గడ్డం కృష్ణను పట్టేసారు. నిందితుడి వద్ద పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.