పెళ్లికి ముందు తను పెళ్లాడబోయే వ్యక్తితో అన్నీ మాట్లాడింది. ఏమైనా దురలవాట్లు వున్నాయా అని మరీమరీ అడిగింది. ముఖ్యంగా మద్యపానం అలవాటు వుందా అనడిగితే... ఒట్టు, నాకలాంటి అలావాట్లు ఏమీ లేవని చెప్పాడతను. దాంతో అతడి మాటలు నమ్మింది. 2022లో వారి వివాహం ఘనంగా జరిగింది. అహ్మదాబాదు నెహ్రూనగర్‌లో తన వైవాహిక జీవితం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల తర్వాత, ఆ జంట తమ హనీమూన్‌కు మౌంట్ అబూకు బయలుదేరారు.
ఒక రిసార్ట్‌లో బస చేసిన సమయంలో తన భర్త తనతో చెప్పినమాటలకు విరుద్ధంగా ప్రతిరోజూ తాగుతున్నట్లు చూసి భార్య షాక్ అయ్యింది. ఐనప్పటికీ తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి అతని మానసిక, శారీరక వేధింపులను భరించింది. హనీమూన్ ముగిసి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చేటపుడు, పూటుగా మద్యం సేవించిన తన భర్త డ్రైవింగ్ చేయాలని పట్టుబట్టాడు, కానీ తీవ్రమైన గొడవ తర్వాత భార్య కారును నడిపింది. హనీమూన్ రోజున తన నిజరూపం చూపించిన భర్త, ఇక ప్రతిరోజూ తాగడం మొదలుపెట్టాడు.
అతని మద్యపానం మరింత తీవ్రమైంది, ఫలితంగా తరచుగా గొడవలు జరిగాయి. అయితే, ఆ మహిళ తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి తన పరిస్థితితో రాజీ పడటానికి ప్రయత్నించింది. డిసెంబర్ 2023లో ఆమె కొడుకుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినా అతడిలో మార్పు రాలేదు. తన భర్త అతని కుటుంబం ఆమెను మానసికంగా హింసించడం ప్రారంభించారు. వారి వేధింపులు భరించలేని బాధిత మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త మద్యపానం వల్ల కలిగే అనేక వైవాహిక వివాదాలను తాము తరచుగా చూస్తామని పోలీస్ స్టేషన్‌లోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలను తాము ధృవీకరించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.