ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు ఆగటంలేదు. కొంతమంది ధైర్యం చేసి కామాంధుల గుట్టును బయటపెడుతున్నారు కానీ చాలామంది ఆ వేధింపులను భరించలేక ఉద్యోగాలను వదిలేయడమో లేదంటే మరోచోటుకి బదిలీ అయి వెళ్లిపోవడమో చేస్తున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా పరిధిలో ఓ రెవిన్యూ అధికారి కామాంధుడిగా మారాడు. విధులు నిర్వర్తించే మహిళలను టార్గెట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే ఓ మహిళ తమ గ్రామంలో అంగన్వాడి టీచర్ పోస్టు ఖాళీగా వుండటంతో దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును స్వీకరించే సమయంలో రెవిన్యు విభాగంలో పనిచేసే అటెండర్ ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆమెకి ఫోన్ చేసాడు.
ఉద్యోగం కావాలంటే డబ్బులతో పని కాదనీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన అధికారిని కలిస్తే పని అయిపోతుందంటూ చెప్పాడు. అతడి అసభ్య మాటలను బాధిత మహిళ తన ఫోనులో రికార్డ్ చేసి, జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసింది. దీనితో అధికారుల బండారం బట్టబయలైంది. బాధిత మహిళ పట్ల వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.