హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న మహిళపై కట్టుకున్న భర్త సిమెంట్ ఇటుకపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానిక పోలీసుల కథనం మేరకు హఫీజ్‌పేట ఆదిత్య నగర్‌కు చెందిన మహ్మద్ బస్‍రత్ (32) అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఇంటీరియల్ పనులు చేస్తున్నాడు. గత 2023 జనవరి నెలలో అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్ (22) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారడంతో గత 2024 అక్టోబరు నెలలో వివాహం చేసుకుని హఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు. అయితే, వేరు కాపురం పెడదామన్న ఫర్వీన్ ఒత్తిడితో బస్‌రత్ తల్లిదండ్రులను కాదని అదే బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆ తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఇటీవల ఫర్వీన్ గర్భందాల్చింది. రెండు నెలల గర్భంతో ఉన్న ఆమెకు వాంతులు అధికం కావడంతో గత నెల 29వ తేదీన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భర్త చేర్పించాడు. వైద్య చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికితీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన బస్‌రత్.. భార్య కడుపుతో ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి కడుపులో కాలితో ఎగిసి తన్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో దాడి చేశాడు. సిమెంట్ ఇటుకను తీసుకుని ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన బస్‌రత్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆ మహిళ కోమాలోకి వెళ్ళిపోయింది. నిందితుడుని అరెస్టు చేశారు.