మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో దారుణం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని తమ కుమార్తె వ్యతిరేకించి, తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది. దీన్ని అవమానంగా భావించిన తండ్రి.. కన్నబిడ్డ అని కూడా చూడకుండా పోలీసుల ఎదుటే ఆమెను కాల్చివేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గ్వాలియర్ పట్టణానికి చెందిన తనూ గుర్దార్‌కు ఆమె తండ్రి మహేశ్ వివాహాన్ని ఏర్పాటుచేశారు. అది ఇష్టం లేని ఆమె.. తన పెళ్లికి నాలుగు రోజులు ముందు, మంగళవారం, 52 నిమిషాలు నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను తనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విక్కీ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, కానీ, తమ కుటుంబం వేరే సంబంధం ఖాయం చేసిందని పేర్కొన్నారు. వారు కుదిర్చిన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు తనను రోజూ ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.
పైగా తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉన్నట్టు పేర్కొంటూ తనను రక్షించాలని ఆ వీడియోలో ఆమె ప్రాధేయపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్సీ ధర్మవీర్ సింగ్ సహా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎందరు ఎన్నివిధాలా చెప్పినా తనూ, తన కుటుంబంతో కలిసి ఉండేందుకు నిరాకరించింది. తనను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి (వన్ స్టెప్ సెంటర్) పంపాలని పోలీసు అధికారులను కోరారు. ఆమె మేజర్ (20 యేళ్లు) కావడంతో తనూను సంరక్షణ కేంద్రంలో చేర్చడానికి పోలీసు అధికారులు సిద్ధమయ్యారు.
దీన్ని జీర్ణించుకోలేని తండ్రి.. తమ కుమార్తెతో పాటు పోలీసు అధికారులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తన కుమార్తెతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరగా, వారు అంగీంకరించారు. దీంతో తమ కుమార్తెను పోలీసుల నుంచి కొద్ది దూరం తీసుకువెళ్లి, పోలీసులు, కుటుంబ సభ్యులంతా చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో నిర్ఘాంతపోయిన పోలీసులు... అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.