Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చనిపోయాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.. మరుసటి రోజే తిరిగొచ్చిన ఆ వ్యక్తి!

Advertiesment
crime scene

ఠాగూర్

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (15:46 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో మహ్మద్ పూర్ ఝార్సా ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడని కుటుంబ సభ్యులంతా కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, ఆ వ్యక్తి మరుసటి రోజు ఇటికి తిరిగి వచ్చి ప్రతి ఒక్కరితీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చనిపోయాడని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేసిన ఓ వ్యక్తి, మరుసటి రోజే ఇంటికి తిరిగి వచ్చి అందరినీ నివ్వెరపరిచాడు. ఈ విచిత్ర ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. భర్త బతికి రావడంతో భార్యాపిల్లలు షాక్కు గురికాగా, వారు దహనం చేసిన మృతదేహం ఎవరిదనే ప్రశ్న పోలీసులను వెంటాడుతోంది.
 
గురుగ్రామ్‌లోని మహమ్మద్ పూర్ ఝార్సా ప్రాంతానికి చెందిన పూజన్ ప్రసాద్ (47) చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆగస్టు 28న పూజన్ ఇంటికి 1.5 కిలోమీటర్ల దూరంలో తల లేని ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అదేసమయంలో కొన్ని రోజులుగా పూజన్ కనిపించకపోవడంతో, అతని కుమారుడు సందీప్ కుమార్ ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు అతడిని మార్చురీకి తీసుకెళ్లి గుర్తు తెలియని శవాన్ని చూపించారు. ఆ శవంపై ఉన్న దుస్తులు, కుడి కాలిపై ఉన్న గాయం గుర్తు తన తండ్రికి ఉన్నట్టే ఉండటంతో సందీప్ పొరబడ్డాడు. అది తన తండ్రి మృతదేహమేనని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించగా, కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు.
 
అస్థికలను యమునా నదిలో కలపడానికి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఖండ్సాలోని లేబర్ చౌక్ వద్ద పూజన్ బతికే ఉన్నాడని, అతడిని బంధువు ఒకరు చూశారని ఆ ఫోన్ సారాంశం. మొదట నమ్మకపోయినా, వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి మంచంపై కూర్చుని ఉన్న తండ్రిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. చనిపోయాడనుకున్న భర్త కళ్లెదుట కనిపించడంతో అతడి భార్య లక్ష్మిణియ స్పృహ తప్పి పడిపోయింది.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారి ఇంటికి చేరుకున్నారు. తాను కొన్ని రోజులుగా మద్యం మత్తులో నిర్మాణ ప్రదేశాల్లో, చౌక్‌లో నిద్రిస్తూ ఇంటికి రాలేదని విచారణలో పూజన్ తెలిపాడు. దీంతో అసలు దహనం చేసింది ఎవరిని? ఆ హత్య చేసిందెవరు? అనే కోణంలో పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం డీఎన్ఏ నమూనాలను భద్రపరిచామని, వాటి ఆధారంగా మృతుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువకుడి ప్రాణం తీసిన మొబైల్ ఫోన్?