హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న చిన్న వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోన్ అడిగినందుకు మొదలైన గొడవ చివరకు హత్యకు దారితీయగా ఈ ఘటనలో వాచ్‌మెన్‌గా పని చేసే వ్యక్తి, అతడి ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్టు చేశారు.
బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు రోడ్డు నంబర్ 14లో నివసించే శ్రీధర్ (30) అనే వ్యక్తి ఈవెంట్లలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితుడుని ద్విచక్రవాహనంపై దించి తిరిగి వస్తుండగా అతడి ఫోన్ స్విచాఫ్ అయింది. దీంతో రోడ్డు నంబర్ 14లోని ఆశా ఆస్పత్రి వద్ద ఆగి, అక్కడి వాచ్‌మెన్ వెంకటయ్యను ఒక కాల్ చేసుకునేందుకు ఫోన్ అడిగాడు.
అయితే, తన ఫోనులో బ్యాలెన్స్ లేదని వెంకటయ్య సమాధానమిచ్చాడు. ఫోన్ ఇవ్వడం ఇష్టం లేకే అతడు అబద్ధం చెబుతున్నాడని భావించిన శ్రీధర్, వెంకటయ్యతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడుతో ఆగ్రహంతో వెంకటయ్యపై శ్రీధర్ చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానిగి గురైన వెంకటయ్య తన కుమారులకు సమారం ఇచ్చారు.
వారు వచ్చీ రావడంతో శ్రీధర్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీధర్.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులు వెంకటయ్య, హరికృష్ణ, తరుణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.