Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక ప్లాటు రెండు రిజిస్ట్రేషన్లు.. 25 కోట్లు హాంఫట్.. ఎక్కడ..?

ఒక ప్లాటు రెండు రిజిస్ట్రేషన్లు.. 25 కోట్లు హాంఫట్.. ఎక్కడ..?
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (23:39 IST)
ఒక స్థలాన్ని ఇద్దరికి అగ్రిమెంట్లు రాయడం వంటివి చూశాం ఇంత వరకు.. కానీ ఇప్పుడు ఏకంగా ఒక స్థలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు సంపాదించే కేటుగాళ్ళ బాగోతం బయటపడింది. ఒకటి రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయలకుపైగా స్థలాలను డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి తప్పించుకు తిరుగుతోంది ఒక ముఠా. ఈ ముఠాలో ప్రధాన పాత్రదారి ఖాకీ కావడంతో పోలీసులను తలనొప్పిగా మారుతోంది.

 
తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భూకబ్జారాయుళ్ళు కొత్తదారి ఎంచుకున్నారు. అది కూడా ఎన్ఆర్ఐలే వారి ప్రధాన టార్గెట్. తిరుపతి సమీపంలోని పేరూరు గెజిటెడ్ ఆఫీసర్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో బాగోతం బయటపడింది. 

 
డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. అంతేకాదు సాక్షాత్తు ఓ పోలీసు ప్రమేయం ఇందులో ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి ఈ డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై ఎం.ఆర్.పల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. 

 
అయితే ఈ డబుల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి బాధితులు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 17మంది దాకా ఉన్నారు. ఒక్కొక్కరి ప్లాట్ విలువ కోటిన్నరకు పైగానే ఉంది. అంటే సుమారు 25కోట్ల రూపాయల దాకా డబుల్ రిజిస్ట్రేషన్లతో సంపాదించేశారు కేటుగాళ్ళు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే తప్ప ముఠా సభ్యుల అసలు బాగోతం బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు బాధితులు. 

 
కేటుగాళ్ళకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను సిబ్బంది సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పేరు మీద రెండు రిజిస్ట్రేషన్లు చేయడం సాధారణమైన విషయం కాదు. ఆన్ లైన్లో మొత్తం మార్చి ఈ బాగోతానికి ముఠా తెరలేపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏ విధంగా విచారణ జరుపుతారన్నది ఆసక్తికరంగా మారుతోంది. 

 
అయితే డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఖాకీ పాత్ర ఇందులో ఉండడంతో ఈ కేసును త్వరలో చేధించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. మరి క్రిందిస్థాయి సిబ్బంది ఎంత వరకు విచారణ వేగవంతం చేస్తారో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులు ఇక నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి.. లేకుంటే?