ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ లైబ్రరీ వెలుపల 17 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి తుపాకీతో కాల్చాడు. నిందితుడు చాలా రోజులుగా ఆ బాలికను వెంటాడుతున్నాడు. ఈ క్రమంలో అతడు సోమవారం కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది, దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
మైనర్ బాలిక, నిందితుడు ప్రైవేట్ లైబ్రరీలో అధ్యయన సెషన్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. వైరల్ అయిన సిసిటివి ఫుటేజ్‌లో నిందితుడు లైబ్రరీ వెలుపల తన బైక్‌పై బాలిక కోసం వేచి ఉన్నట్లు కనబడుతోంది. బాలిక తన స్నేహితురాళ్లతో వస్తుండగా ఆమెను చూసి, పిస్టల్ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు.
సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. వీడియోలో తుపాకి గాయాలకు గురైన బాధితురాలు అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూడవచ్చు. సంఘటన తర్వాత బాధితురాలి స్నేహితురాలు కూడా ఆమె వైపు పరుగెత్తింది. కాల్పుల తర్వాత ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. కాగా నిందితుడు ఆయుధాన్ని ఘటనాస్థలం వద్ద వదిలిపెట్టాడు. ఆ ఆయుధాన్ని పోలీసులు అక్కడి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితుడిని తాను గుర్తించానని, గతంలో కూడా అతను తనను ఇబ్బంది పెట్టాడని ఆ బాలిక పోలీసులకు చెప్పింది. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.