41 ఏళ్ల నిషాంత్ త్రిపాఠి అనే వ్యక్తి ముంబై లోని సహారా హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు తను బుక్ చేసుకున్న హోటల్ గది తలుపులకి బైట DO not Disturb అనే ప్లకార్డు తగిలించాడు. దీనితో హోటల్ సిబ్బంది కూడా అతడేదో ముఖ్యమైన పనిలో వుండి వుంటాడని అనుకున్నారు. కానీ 24 గంటలు గడిచినా గది నుంచి అతడు బైటకు రాకపోవడంతో తమ వద్ద వున్న మాస్టర్ తాళంచెవితో తలుపులు తెరిచారు. లోపలికెళ్లి చూడగా అతడు బాత్రూంలో వున్న ఇనుప రాడ్డుకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు దర్యాప్తు చేయగా పలు విషయాలు బైటకు వచ్చాయి.
అతడు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో అతడు తన చావుకి తన భార్య అపూర్వ, అత్త ప్రార్థనలే కారణమంటూ పేర్కొన్నాడు. ఇంకా ఆ లేఖలో... '' హాయ్ బేబ్, నువ్వీ ఉత్తరం చదివేటప్పటికి నేను చనిపోయి వుంటాను. ఐనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే వుంటాను. దయచేసి నా పేరెంట్స్‌ను టార్చర్ పెట్టొద్దు" అని రాసాడు. తొలుత నిషాంత్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత భార్య,అత్తల పేర్లను జోడించారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి వుందని పోలీసులు తెలిపారు.
కాగా ఇటీవలి కాలంలో భార్యల వేధింపులతో మరణిస్తున్న మగవారి కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో మగవారి రక్షణకు కూడా చట్టం చేయాల్సి వుందంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.