స్వయంగా ఓ కోడలు అత్తను హత్య చేసి ట్రాలీ బ్యాగులో పెట్టుకుని గంగానది తీరానికి వచ్చింది. ఆమె వాలకం అనుమానం కలగడంతో అక్కడివారు అందులో ఏముంది అని ప్రశ్నించారు. కుక్క మృతదేహం వుందని ఆమె చెప్పింది కానీ బ్యాగు తెరిచి చూసిన స్థానికులు షాక్ తిన్నారు. అందులో ఆమె అత్త మృతదేహం ముక్కలు చేసి అందులో వున్నది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర కోల్ కతా గంగా నది ప్రాంతంలోని ఘాట్ రోడ్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఇద్దరు మహిళలు ఓ ట్రాలీ బ్యాగును మోయలేక మోయలేక కిందకి దించారు. ఆ తర్వాత దాన్ని మెల్లగా ఈడ్చుకుంటూ నదివైపు వెళుతున్నారు. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్నవారికి వీరి వాలకంపై అనుమానం వచ్చింది. అందులో ఏమున్నదంటూ ప్రశ్నించారు. కుక్క చచ్చిపోతే దాన్ని ఈ సూట్ కేసులో పెట్టి పడేసేందుకు వచ్చామని చెప్పారు.
ఐతే కుక్క చస్తే ఎక్కడో శివారులోనో, మునిసిపాలిటీ వారికో చెప్పాలి కానీ ఇంత ఖరీదైన బ్యాగులో ఎందుకు వేసుకు వస్తున్నారంటూ అక్కడివారు ప్రశ్నించారు. ఐతే వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వని మహిళలు త్వరత్వరగా బ్యాగును గంగలో పడేసేందుకు ముందుకు వెళ్తున్నారు. దీనితో వారిని అక్కడివారు అడ్డగించి ఆ బ్యాగులో ఏముందని బలవంతంగా తెరిచారు. అంతే... బ్యాగు చూసి షాక్ తిన్నారు. అందులో వున్నది ఓ మహిళ శవం, ముక్కలు చేసి వున్నది. దీనితో పోలీసులకు సమాచారం అందించారు. వారి విచారణలో తేలిందేమిటంటే.... తన అత్తను హత్య చేసి ఇలా పెట్టెలో పెట్టి గంగలో పడేసేందుకు కోడలు వచ్చింది. దీనికి సహాయం చేసేందుకు ఆమె తల్లి కూడా వచ్చింది. ఐతే ఆ మహిళను ఎందుకు హత్య చేసారన్నది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.