Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దత్తపుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చిన బాలిక

juliana
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (15:54 IST)
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ దారుణం జరిగింది. తనను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన తల్లినే తన ప్రియుడితో కలిసి ఓ బాలిక హత్య చేసింది. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రి, కంబాల పేటకు చెందిన మార్గటరెట్ జూలియాన (63) అనే రిటైర్డ్ ఉపాధ్యాయురాలు తమ 13 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త నాగేశ్వర రావు ఎఫ్.సి.ఐలో మేనేజరుగా పని చేసి పదవీ విరమణ చేశారు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. జూలియాన ఆస్మా వ్యాధితో బాధపడుతుంది. 
 
వీరికి సంతానం లేకపోవడంతో13 యేళ్ల క్రితం ఓ పేద కుటుంబానికి చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన సాయంత్రం జూలియాన బాత్రూమ్‌లో ప్రమాదవశాస్తు జారిపడిపోయింది. వెంటనే కుమార్తెతో పాటు ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. 
 
మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో తన తల్లి అపస్మారక స్థితిలో ఉందని బాలిక సీతానగరంలో ఉండే జూనియాన మరిది అంజియాకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చి జూలియానాను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. అంజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పెంపుడు కుమార్తె చెబుతున్న మాటలకు, పంచనామా నివేదికకు ఏమాత్రం పొంతన కుదరలేదు. 
 
పైగా, బాలిక ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో ఆమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన గారా ఆకాష్ (19)తో ఆమె ప్రేమలో మునిగితేలుతున్నట్టు తేలింది. జూలియానా మృతి చెందిన నాటి నుంచి ఆకాష్‌తో పాటు అతని మరో ఇద్దరు స్నేహితులు గ్రామంలో కనిపించకుండా పోయారు. దీంతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించారు. 
 
ఆకాష్‌తో ప్రేమలో ఉండటాన్ని గమనించిన జూలియానా తమ కుమార్తెను మందలించింది. ఇది వారిద్దరి మధ్య వివాదాలకు దారితీసింది. తల్లి చెబుతున్న మాటలన్నీ తనపై ద్వేషంతో చెబుతున్నట్టుగా భావించిన బాలిక.. తన ప్రియుడు, అతని స్నేహితులకు చెప్పగా, వారు తప్పుడు మార్గాన్ని చూపించారు. ప్రమాదవశాత్తు స్నానాలగదిలో జారిపడి విశ్రాంతి తీసుకుంటున్న పెంపుడు తల్లిని తన ప్రియుడి, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ముక్కు, నోటిని దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు తేలింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా అంజియాకు ఫోన్ చేసి, అతను వచ్చిన తర్వాత జూలియానాను ఆస్పత్రికి తరలించినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో బాలిక, ఆమె ప్రియుడు, అతని ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గజ్వేల్‌లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్.. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా?