ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది. తాను హాయిగా కునుకు తీసేందుకు వీలుగా ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శామలి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ రాష్ట్రంలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు.
ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబ సభ్యులు వెళ్లేసరికి విగతజీవులై కనిపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పైగా, వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ నీతును అరెస్టు చేశారు.