ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టిన మహ్మద్ షమీ.. ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పినట్లు చేయడం వల్లే మ్యాజిక్ జరిగిందని.. చెప్పుకొచ్చాడు. భారత్-ఆప్ఘనిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించే దిశగా ఆప్ఘనిస్థాన్ బరిలోకి దిగింది. ఒక దశలో ఆప్ఘనిస్థాన్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ చివరి నాలుగు ఓవర్లు బుమ్రా, చివరి ఓవర్ మహ్మద్ షమీ బౌలింగ్ చేశారు. వీరిద్దరి పుణ్యమా అంటూ భారత్ ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలిగింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో పోరాడి గెలిచింది.
గత 1987వ సంవత్సరంలో న్యూజిలాండ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో.. భారత ఫాస్ట్ బౌలర్ శర్మ హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత 32 సంవత్సరాలకు తర్వాత.. ప్రపంచకప్ చరిత్రలో షమీ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. దీనిపై షమీ స్పందిస్తూ.. రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత ధోనీ తన వద్దకు వచ్చాడు.
ఈ వ్యూహంలో ఎలాంటి మార్పు చేయొద్దని చెప్పాడని.. ఇంకా హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా వుందని చెప్పాడు. ఇలాంటి అవకాశాలు లభించడం అరుదు.. కాబట్టి వ్యూహంలో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు దూసుకెళ్లండి అంటూ ప్రోత్సాహించాడని షమీ చెప్పుకొచ్చాడు. యార్కర్ బంతులేయమని ధోనీ చెప్పడంతో తాను కూడా అదేవిధంగా యార్కర్ విసిరానని.. అలా హ్యాట్రిక్ కొట్టానని షమీ వెల్లడించాడు.