ప్రపంచ కప్ ఫైనల్ పోరులో అధిక బౌండరీలను బట్టి ఇంగ్లండ్ గెలుపొందిందని తీర్మానించిన ఐసీసీపై భారత మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలిపై భారత మాదీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో కివీస్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 241 పరుగులు సాధించడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో అధిక బౌండరీలు సాధించిన జట్టు ఆధారంగా ఇంగ్లండ్ గెలుపును నమోదు చేసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ తీర్మానంపై టీమిండియా మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత స్టార్ ప్లేయర్ మహ్మద్ కైఫ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అధిక బౌండరీల ఆధారంగా గెలుపును నిర్ణయించడాన్ని జీర్ణించుకోలేం. మళ్లీ ఒక సూపర్ ఓవర్ ఆడమని గెలుపును నిర్ణయించాల్సింది. అధిక బౌండరీల ఆధారంగా జట్టు విజయాన్ని ఎలా నిర్ణయిస్తారు. కివీస్ జట్టుకు ఈ నిర్ణయం కఠినమైంది.. అన్నాడు.
అలాగే మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఐసీసీ నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రపంచ కప్ ఫైనల్ నిర్ణయం బౌండరీల ఆధారంగా తీసుకోవడమా.. ఇది చాలా ప్రమాదకరం. ఈ ప్రపంచ కప్‌లో కివీస్- ఇంగ్లండ్ జట్లు రెండూ గెలిచినట్లే. ఇది టైగానే ముగించివుంటే బాగుండేదని గంభీర్ వ్యాఖ్యానించాడు.
అలాగే యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి రూల్స్‌ను అంగీకరించలేం. అయినా రూల్స్ రూల్సే. ఏది ఏమైనా ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ జట్టుకు శుభాకాంక్షలు చెప్తున్నానని యువీ పేర్కొన్నాడు. అయితే తన మనసంతా కివీస్ చెంతనే వుందని.. ఈ ఏడాది ఫైనల్ అద్భుతంగా జరిగిందన్నాడు.
ఇకపోతే.. టీమిండియా మాజీ ఆటగాళ్లు ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో.. సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఐసీసీ రూల్స్ అనే హ్యాష్ ట్యాగ్ట్ ట్రెండ్ అవుతోంది. ఇంకా అగ్రస్థానంలో వుంది. ఇంగ్లండ్‌ను తక్కువ చేసి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ విజయాన్ని తీర్మానించే నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని యువీ ఐసీసీకి హితవు పలికాడు. ఇంకా కొత్త రూల్స్ రావాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.