టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెమీఫైనల్ పోరులో రనౌట్ కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో ఓటమితో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. ఆ వెంటనే భారత జట్టు స్వదేశానికి పయనం కావాల్సి ఉండగా టికెట్లు లేక భారత జట్టు లండన్‌లో ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమికి ధోనీయే కారణమని నిందించాడు. కీలక ఓవర్లలో నెమ్మదిగా ఆడుతూ రవీంద్ర జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని ఫలితంగా భారీ షాట్‌కు యత్నించి జడేజా అవుటయ్యాడని తెలిపాడు.
జడేజా భారీ షాట్లు ఆడుతుంటే ధోనీ నెమ్మదిగా ఆడాడని విమర్శించాడు. రవీంద్ర జడేజా 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా ఆడమని చెప్పి అతడి అవుట్‌కు కారణమయ్యాడని వాపోయాడు. స్పిన్నర్లపై దాడి చేయాలంటూ పాండ్యాకు చెప్పాడని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు.