వన్డే ప్రపంచ కప్‌: ఆ ఇద్దరికీ జట్టులో స్థానం వుంటుందా?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (13:47 IST)
వన్డే ప్రపంచ కప్‌లో ఆడేందుకు క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్‌‍లు.. ప్రపంచ కప్ జట్టులో స్థానం పొందుతారా అనే దానిపై చర్చ మొదలైంది. వీరిద్దరికీ జట్టులో స్థానం లభిస్తుందా? లేదా? అనే దానిపై కోచ్ జస్టిన్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.


ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది టీమిండియా. టెస్టు, వన్డేల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా చేతిలో సొంత గడ్డపై ఓడిపోవడం ద్వారా కంగారూల జట్టుకు అవమానం తప్పలేదు.
 
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టులో లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా జట్టు విజయాలను నమోదుచేసుకోవట్లేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా వన్డే ప్రపంచ కప్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేకపోతే పరిస్థితి దారుణంగా వుంటుందని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనను అర్థం చేసుకున్న ఆసీస్ క్రికెట్ బోర్డు.. స్టీవ్, వార్నర్‌లను జట్టులోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 
 
కానీ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో విధించిన నిషేధం ఇంకా ముగియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లు, ఐదు వన్డే పోటీల్లో ఆడనుంది. ఇందుకోసం అరోన్ పించ్ నాయకత్వంలోని 16మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 
 
కాగా.. ప్రస్తుతం భారత్‌కు వెళ్లే ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్‌కు సంబంధించినది కాదని ఆసీస్ కోచ్ తెలిపారు. దీంతో ప్రపంచ కప్ కోసం ప్రకటించే జట్టులో స్మిత్, వార్నర్‌లకు చోటు వుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఓడిపోతామని తెలుసు.. అయినా ధోనీ బ్యాటింగ్‌ను అంతమంది చూశారే?