Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్యూరిటీ గార్డు నుంచి అంతర్జాతీయ క్రికెట్ బౌలర్ వరకు... షమర్ జోసెఫ్ కేరీర్..

Advertiesment
Shamar Joseph

వరుణ్

, సోమవారం, 29 జనవరి 2024 (14:41 IST)
క్రికెట్ రారాజు ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించిన వెస్టిండీస్ జట్టులో కీలక భూమికను పోషించింది ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. బౌలింగ్ చేస్తున్నంతసేపు కంగారుల వెన్నులో వణుకు పుట్టించాడు. తాజా జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి ఆసీస్ జట్టును కుప్పుకూల్చి చిత్తుగా ఓడించాడు. అలాంటి షమర్ జోసెఫ్ జీవిత ప్రయాణం ఎన్నో కష్టాల కడలిలో సాగింది. 
 
కేవలం 350 మంది నివసించే కుగ్రామంలోని నిరుపేద ఇంటిలో జన్మించిన షమర్ జోసెఫ్... గత యేడాది వరకు ఓ సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. పైగా, శిక్షణ లేకుండానే క్రికెట్ బౌలింగ్‌పై సాధన చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే దిగ్గజ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ఇంటికి పంపించి ఒక్కసారిగా వార్తలకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి కరేబియన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
తన బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న జోసెఫ్ ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. విండీస్ దిగ్గజ పేసర్లు ఆండ్రూ ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్ అంటే అరవీరభంకరమైన బౌలర్లను ఇష్టపడేవాడు. స్నేహితుల దగ్గర ఎప్పుడైనా బంతి దొరికితే దానిని పట్టుకుని సంధించేందుకు ప్రయత్నించేవాడు. వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. 
 
అయినప్పటికీ ఇల్లు గడిచేది కాదు, దీంతో ఓ కోత మిషన్ వద్ద పనికి కుదిరాడు. ఈ క్రమంలో ఓసారి చెట్టును కొట్టే ప్రయత్నంలో అది కూలడంతో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి సెక్యూరిటీగార్డుగా చేరాడు. ఆ పనిలో ఉంటూనే వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడసాగాడు. గతేడాది వరకు అతడు సెక్యూరిటీ గార్డుగానే పనిచేశాడు.
 
ఎలాంటి శిక్షణ లేకపోయినా అద్భుతంగా బంతులు సంధిస్తూ వికెట్లు తీస్తున్న జోసెఫ్‌ను గయానా హార్ఫీ ఈగల్స్ జట్టు యాజమాన్యం గుర్తించింది. గతేడాది ఫిబ్రవరిలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించింది. అలా ఈగల్స్ జట్టుకు ఆడిన జోసెఫ్ మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందులోనూ ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా జూనియర్ జట్టు పర్యటనలో విండీస్-ఎ జట్టులో చోటుదక్కింది. ఆ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియాలో పర్యటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకున్నాడు. 
 
ఇక, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్మిత్ వికెట్ తీసి అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఆ మ్యాచ్ మొత్తంగా నాలుగు వికెట్లు తీసి తన ప్రదర్శన భళా అనిపించుకున్నాడు. 24 ఏళ్ల జోసెఫ్ పేస్‌కు స్వింగ్‌ను జతచేసి బంతులను బుల్లెట్లుగా మారుస్తాడు. స్లో ఆఫ్ కటర్స్, స్లో బౌన్సర్లతో కంగారూలను కంగారు పెట్టాడు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తద్వారా తనలోని ప్రతిభ గాలివాటం కాదని నిరూపించుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత కరీబియన్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించిపెట్టిన జోసెఫ్‌పై క్రికెట్ దిగజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబుల్స్ టైటిల్ నెగ్గిన రోహన్నకు నాదల్‌ అభినందనలు