ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్‌గా కోల్‌కతా నిలిచింది. ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. "ఆరెంజ్ క్యాప్‌లు టైటిల్‌ను అందించలేవు. ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టినంత మాత్రాన కప్ సాధించినట్లు కాదు" అని కామెంట్రీ సందర్భంగా రాయుడు వ్యాఖ్యానించాడు.
దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని.. తమ అభిమాన క్రికెటర్‌పై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. తాజాగా అంబటి కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపులు వచ్చినట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితుడి కుటుంబంతో కలిసి అంబటి రాయుడి ఫ్యామిలీ డిన్నర్‌కు వెళ్లింది. ఆ సమయంలోనే తమకు హత్యాచారం బెదిరింపులు వచ్చినట్లు రాయుడు భార్య విద్య తెలిపినట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ఇటీవల ఐపీఎల్ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా ఉన్న అంబటి రాయుడు ఓ జట్టు ప్రదర్శనపై వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కొందరు పనిగట్టుకొని విమర్శలు చేయడం ప్రారంభించారు. మొదట్లో మేం సరదాగానే తీసుకున్నాం. అయితే, అసభ్యకర రీతిలో పోస్టులూ చేశారు. అదే సమయంలో రాయుడు భార్య తమపై వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తున్నారని తెలిపారు. బాధ్యతగా ఉన్న ఓ వ్యక్తి కుటుంబంపై ఇలా రెచ్చిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మాట్లాడే స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగినట్లే. తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. పోలీసులు సత్వరం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన, మద్దతు ఇచ్చినవారు ఎంతటి స్టార్లు అయినా వదిలిపెట్టొద్దు' అని పోస్టులో పేర్కొన్నారు.