భారత జట్టు విధ్వంసక క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లోకూడా తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. విధ్వంసం అంటే బ్యాట్‌తో పరుగుల వరద సృష్టించడం కాదు. ఆద్యంతం అలరించే తన హాస్యస్పోరకమైన, పదునైన వ్యాఖ్యల ద్వారా గత ఆరునెలల కాలంలో సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా సంపాదించిన ఆదాయం గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. తానే స్వయంగా చెప్పినదానిని బట్టి ట్విట్టర్ వ్యాఖ్యల ద్వారా ఇటీవలి కాలంలో తన సంపాదన 30 లక్షల రూపాయలట.
భారత జట్టు తరపున టెస్టుల్లో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్. తన తరంలో అత్యంత ఉత్కంఠ కలిగించిన బ్యాట్స్‌మెన్‌లలో సెహ్వాగ్ ఒకరు. ఆటనుంచి రిటైరైన తర్వాత కూడా తన అభిమానులను అలరించడంలో వీరూ ఏమాత్రం వెనుకాడటం లేదు. దీంతో 2016లో మైక్రో బ్ల్గాగింగ్ సైట్ ట్విట్టర్‌లోఅత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా వెలుగులోకి వచ్చాడు. తన వ్యంగ్యంతో కూడీన ట్వీట్‌ల ద్వారా జాతి మొత్తాన్ని తనవైపు ఆకర్షించుకున్నాడు.
ముల్తాన్ కా సుల్తాన్ అని పేరొందిన సెహ్వాగ్ క్రికెటర్ల జన్మదిన సందర్భంగా కడుపుబ్బ నవ్వించే దేశీ హాస్యంతో కూడిన శుభాకాంక్షలను అందించడంలో సెహ్వాగ్‌ను మించినవారు లేరు. భారతీయ క్రికెట్ జట్టు మ్యాచ్‌లకు హిందీ కామెంటరీ టీమ్‌లో ఒకడుగా మారిన వీరు ట్విట్టర్‌లో 140 క్యారెక్టర్ల పరిమితిని అద్భుతంగా వినియోగించుకోవడం ద్వారా తోటి కామెంటేటర్లనుంచి ప్రశంసలందుకున్నాడు. చాలామంది భారతీయ క్రికెటర్లు సోషల్ మీడియా నుంచి దూరం పాటిస్తుంటే, సెహ్వాగ్ వ్యంగ్య హాస్య ధోరణి అతడి ఫ్యాన్‌లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కామెంట్ల ద్వారా సంపాదించిన మొత్తాన్ని సెహ్వాగ్ స్వయంగా పేర్కొన్నాడు. నా ట్వీట్‌ల ద్వారా నేను గత ఆరు నెలలుగా కనీసం 30 లక్షల రూపాయలను సంపాదించానని గర్వంగా చెప్పాడు. తన ట్వీట్‌లను వేలాది మంది షేర్ చేయడంతో స్పాన్సర్లు ఆటోమేటిక్‌గా తనను సంప్రదిస్తున్నారని తెలిపాడు.
ఒకసారి నేను ట్విట్టర్‌లో అడుగుపెట్టాక నా దేశీజోక్ లను షేర్ చేయడం మొదలెట్టాను. అవి పెద్ద హిట్‌ను సాధించాయి. నా ఫాలోయింగ్ పెరిగింది. కొన్ని పోస్ట్‌లను వేలాది మంది రీట్వీట్ చేశారు. దీంతో స్పాన్సర్ల నుంచి డబ్బు నా వద్దకు వరదలాగా రావటం మొదలైంది అన్నాడు సెహ్వాగ్.
సెహ్వాగ్ దేశీ జోకుల మాట ఏమో గానీ ట్విటర్ ద్వారా తన సంపాదన విషయం వింటే మైండ్ బ్లోయింగ్ అనిపించటంలా...