ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ విసిరిన బంతి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇషాంత్ శర్మ విసిరిన బంతికి ఆస్ట్రేలియా క్రికెటర్ పించ్ తన వికెట్‌ను సమర్పించుకుని పెవిలియన్ ముఖం పట్టాడు. భారత జట్టు ఇదివరకు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు కప్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు.
అయితే ఈ సారి ఆసీస్ గడ్డపై ట్రోఫీని గెలుచుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అడిలైడ్ తొలి టెస్టు, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు సాధించి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో భారత క్రికెటర్లు ధీటుగా రాణించలేకపోయారు. అయితే పూజారా మాత్రం 123 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పించ్‌ను ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్‌తో పడగొట్టాడు.
ఇషాంత్ శర్మ విసిరిన మూడో బంతికి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పించ్ ధీటుగా ఎదుర్కోలేకపోయాడు. దీంతో భారీ వేగంతో ఇషాంత్ బాల్ స్టంప్‌ను విరగ్గొట్టింది. ఆ బంతి వేగానికి మరో రెండు స్టంప్స్ కూడా గాల్లోకి ఎగిరి పడ్డాయి. దీంతో పించ్ పెవిలియన్ దారి పట్టాడు. ఇషాంత్ శర్మ పించ్ వికెట్‌ను పడగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.