ఒక్క ఓవర్ ఆడిన సచిన్.. బ్యాట్‌లో మజా తగ్గలేదు.. తొలి బంతికే బౌండరీ (video)

ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (16:28 IST)
Sachin Tendulkar
ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చులో పలు ఎకరాల వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ కార్చిచ్చులో చాలామంది పంటలు నష్టపోయారు. అటవీ జంతువులు అగ్నికి బలైపోయాయి. ఈ నేపథ్యంలో ఈ కార్చిచ్చు బాధితుల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ ఓ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో జరిగింది. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నేతృత్వంలో ఓ జట్టు, ఆడమ్ గిల్ క్రిస్ట్ నాయకత్వంలో మరో జట్టు తలా పది ఓవర్ల మ్యాచ్‌ను ఆడాయి. 
 
రికీ పాంటింగ్ జట్టుకు క్రికెట్ జాంబవంతుడు సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇన్నింగ్స్ విరామంలో బ్యాట్స్‌మెన్ అవతారం ఎత్తాడు.  చాలా బంతుల‌ను మిడిల్ చేసిన స‌చిన్‌.. త‌న టైమింగ్‌లో ఎలాంటి మార్పు లేద‌ని నిరూపించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ పడితే కార్చిచ్చు బాధితుల కోసం మరిన్ని నిధులు సమకూర్చవచ్చునని.. ఆస్ట్రేలియా క్రికెట్ మహిళా జట్టుకు చెందిన ఎల్లిసి బెర్రి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన సచిన్ ఒక ఓవర్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం పసుపు రంగు డ్రెస్ కోడ్‌తో సచిన్ మళ్లీ మైదానంలోకి దిగాడు. ఆసీస్ మ‌హిళా బౌల‌ర్ ఎలీసా పెర్రీ, అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.
 
మైదానంలోని క్రికెట్ అభిమానుల కరతాళధ్వనుల మధ్య.. మైదానంలో బ్యాట్ పట్టిన సచిన్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే.. తనదైన శైలిలో బౌండరీకి పంపాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత బ్యాట్ పట్టిన సచిన్.. మైదానంలో తన ఆటతీరులో ఎలాంటి మార్పు కనబరచలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సచిన్ ఆడిన ఒక ఓవర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. ఉత్కంఠభరితంగా సాగిన బుష్‌ఫైర్ బాధితుల సహాయార్థం జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఎలెవ‌న్‌పై ఒక్క ప‌రుగు తేడాతో పాంటింగ్ ఎలెవ‌న్ విజ‌యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాంటింగ్ లెవ‌న్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 104 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారా (11 బంతుల్లో 30 రిటైర్డ్ ఔట్‌, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కెప్టెన్ రికీ పాంటింగ్ (26), మ‌థ్యూ హేడెన్ (16) రాణించారు. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌తోపాటు కోట్నీ వాల్ష్‌, అండ్రూ సైమండ్స్ త‌లో వికెట్ తీశారు.
 
లక్ష్యసాధనలో 10 ఓవర్లు ఆడిన గిల్‌క్రిస్ట్ ఎలెవ‌న్ ఆరు వికెట్ల‌కు 103 ప‌రుగులు చేసి ఓడిపోయింది. ఓపెన‌ర్ షేన్ వాట్స‌న్ (9 బంతుల్లో 30 రిటైర్డ్ ఔట్‌, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అండ్రూ సైమండ్స్ (13 బంతుల్లో 29 రిటైర్డ్ ఔట్‌, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌యత్నం చేశారు. యువ‌రాజ్ సింగ్ (2) మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. చివరి ఓవ‌ర్లో 17 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో గిల్‌క్రిస్ట్ లెవ‌న్ 15 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. పాంటింగ్ ఎలెవెన్ జట్టు బౌల‌ర్ల‌లో బ్రెట్ లీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ల్యూక్ హోడ్జ్ ఒక వికెట్ తీశాడు.
 
             

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రతీకారం తీర్చుకున్న కివీస్.. వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా