వచ్చే సెప్టెంబరులో భారత్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు జరుగుతున్నాయి. కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఐపీఎల్‌ను నడిపిస్తున్నారు.
దీనిపై ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్, అంపైర్లు ఇప్పటికే లీగ్‌ను వదిలి వెళ్లిపోయారు. కానీ బీసీసీఐ మాత్రం ఎలాగోలా టోర్నీని కొనసాగిస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఇలాగే ఉంటే మాత్రం రానున్న రోజుల్లో భారతదేశంలో జరగాల్సిన పెద్ద టోర్నీలు వెళ్లిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా అక్టోబరు - నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ ఇండియా జరగడం అనుమానంగానే ఉంది. ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి వచ్చివెళ్లే విమానాలపై నిషేధం విధించడం, ప్రయాణాలపై ఉన్న ఆంక్షల నేపథ్యంలో టోర్నీని ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా బీసీసీఐ జనరల్ మేనేజర్, టీ20 వరల్డ్‌కప్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ అత్యవసర ప్రణాళిక ప్రకారం టోర్నీ యూఏఈలో జరుగుతుంది. అయితే ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ దగ్గరే ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు.
టోర్నీ నిర్వహించేది బీసీసీఐ అయినప్పటికీ ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇండియా కోల్పోతుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం హైదరాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. కానీ, కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రభావం తగ్గకపోతే మాత్రం ఈ టోర్నీ దుబాయ్ వేదికగా జరిగే అవకాశంవుంది.