ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆటలో భారత్ వరసగా వికెట్లు కోల్పోయింది. శనివారం వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయిన మ్యాచ్, ఈ ఉదయం తిరిగి ప్రారంభం కాగా, ఇప్పటివరకూ ఐదు వికెట్లను ఇండియా నష్టపోయింది.
టాప్ ఆర్డర్ మొత్తం పెవీలియన్ దారి పట్టడంతో, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్య రహానే 37, మయాంక్ అగర్వాల్ 38 పరుగులు చేసి అవుటైన సమయంలో భారత స్కోరు 63 ఓవర్లలో 281/6.
అయితే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరినీ పెవిలియన్‌కు పంపించేసామని సంబరపడిన కంగారూలను గట్టి దెబ్బే కొట్టారు.
ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇప్పటికే ఏడో వికెట్‌కు సెంచరీకిపైగా పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పడం విశేషం. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఈ ఇద్దరు బౌలర్లూ ఆదుకున్నారు.
కళ్లు చెదిరే షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరూ.. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సుందర్ హాఫ్ సెంచరీ చేయగా.. అటు శార్దూల్ ఠాకూర్ కూడా కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ కు రెండు, మిచెల్ స్టార్క్, పాట్ కుమిన్స్, నాథన్ లియాన్ లకు తలో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ మరో రెండు రోజులు మాత్రమే మిగిలివుండటంతో, డ్రా చేసుకోవడం ద్వారా, గతంలో గెలుచుకున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని తమతోనే ఉంచుకోవాలన్న వ్యూహంతో ఇండియా ఆడాల్సి వుంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, తొలి టెస్టును ఆస్ట్రేలియా, రెండో టెస్టును భారత్ గెలుచుకోగా, మూడవ టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లూ ఒక్కో విజయంతో సమానంగా ఉన్నాయి. బ్రిస్బేన్ మైదానంలో ఇంతవరకూ ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఆసీస్ ఆటగాళ్లు, మిగతా ఐదు వికెట్లను తీయాలని శ్రమిస్తున్నారు.