Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జోరుమీదున్న రోహిత్ సేన... ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధం...

Team India

వరుణ్

, గురువారం, 27 జూన్ 2024 (08:46 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మంచి జోరుమీద ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయభేరీ మోగిస్తూ సెమీస్‌కు దూసుకొచ్చింది. ఈ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లూ తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా గత 2022లో పొట్టి కప్‍‌ సెమీస్‌లో తలపడ్డాయి. ఇందులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆ ఓటమికి ఈసారి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 
 
మనోళ్ల సంప్రదాయ ఆటతీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఆటతీరు మార్చుకొన్న భారత్‌.. టీ20లకు అవసరమైన దూకుడును అలవర్చుకొంది. పేపర్‌పై చూస్తే భారత జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. అజేయంగా సెమీస్‌కు చేరినా.. టాపార్డర్‌లో కోహ్లీ ఫామ్‌ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కానీ, రోహిత్‌ ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌తో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 
 
ఆస్ట్రేలియాపై చెలరేగిన తీరు.. అతడి ఆటపై నెలకొన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. మిడిలార్డర్‌లో శివమ్‌ దూబే కూడా ఆశించిన స్థాయిలో ఆడలేక పోవడం విమర్శలకు దారితీస్తున్నా.. విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చడానికి మేనేజ్‌మెంట్‌ ఇష్టపడడం లేదు. స్పిన్‌ బాధ్యతలను జడేజా, అక్షర్‌, కుల్దీప్‌ చేపట్టనున్నారు. ఇక, పేసర్‌ బుమ్రా నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు సానుకూలం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా మెరుగ్గా రాణిస్తున్న నేపథ్యంలో.. జట్టు మరోసారి అతడి నుంచి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది.
 
మరోవైపు, ఇంగ్లండ్ జట్టు కిందామీదా పడుతూ సెమీస్‌ చేరింది. అమెరికా మ్యాచ్‌తో కెప్టెన్‌ బట్లర్‌ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. ఓపెనర్‌ ఫిల్‌సాల్ట్‌, బెయిర్‌స్టో, బ్రూక్‌ కూడా ధనాధన్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ స్పిన్‌ భారాన్ని మోస్తున్నారు. పేసర్లలో ఆర్చర్‌కు జోడీగా జోర్డాన్‌, మార్క్‌ ఉడ్‌లలో ఎవరికి తుదిజట్టులో చోటు కల్పించాలనే డైలమాలో బట్లర్‌ ఉన్నాడు. మొత్తంగా ఈ సమవుజ్జీల సమరం ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.
 
జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, కుల్దీప్‌. 
ఇంగ్లండ్‌: సాల్ట్‌, బట్లర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, కర్రాన్‌, జోర్డాన్‌/మార్క్‌ ఉడ్‌, ఆర్చర్‌, టోప్లే, రషీద్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : తుది అంకానికి చేరిన టోర్నీ.. నేడు తొలి సెమీ ఫైనల్